హీరోల రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడుతున్నారని.. అంత కంటే ఏపీకి పనికొచ్చే విషయాలు మాట్లాడవచ్చని… సలహా ఇచ్చినందుకు చిరంజీవిపై వైసీపీ నాయకులు ఎగబడిన వ్యవహారం ఇప్పటికీ కళ్ల ముందే ఉంది. కొడాలి నాని పకోడిగాళ్లంటూ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి డాన్సులు, యాక్షన్ పైనా సెటైర్లు వేశారు. చిరంజీవి ఉద్దేశించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. గుడివాడలో కాపు వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాలీలు నిర్వహించింది. ఇప్పుడు చిరంజీవి బర్త్ డే వేడుకల్ని కొడాలి నాని తన అనుచరులతో కలిసి నిర్వహించారు. కాపు వర్గం ఇప్పటికీ కొడాలిపై మండిపడుతోంది. దీంతో ఆయన వ్యూహాత్మకంగా తన అనుచరులకు చిరంజీవి ఫ్యాన్స్ ముద్ర వేసి వేడుకలు నిర్వహించారు. తాను చిరంజీవిని ఏమీ అనలేదని చెప్పుక`చ్చారు.
రాజకీయంగా చింజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసని .. అయితే అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని గురించి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతానని హెచ్చరించారు. తమకు ఇచ్చిన సలహాలు ఇండస్ట్రీలోని ఇతర పకోడిగాళ్లకు ఇవ్వమని మాత్రమే చెప్పానంటున్నారు. తాను ఏం మాట్లాడినా ఏపీలోని ప్రతిపక్షాలకు బూతులాగే వినిపిస్తుందని కొడాలి చెప్పుకొచ్చారు. అప్పటికే ఆయనేదో శ్రీరామ అని మాత్రమే మాట్లాడాతరన్నట్లుగా కవర్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి తనకు మధ్య అగాధాలు సృష్టించడానికి టీడీపీ, జనసేన నేతలు ప్రయత్నిస్తున్నారని తాను చిరంజీవిని విమర్శించినట్లు నిరూపించాలని టీడీపీ, జనసేనలకు సవాల్ విసిరారు.
తన వెంట 60 శాతం మంది ఆయన అభిమానులే ఉంటారని.. ఎవరి జోలికి వెళ్లని మెగాస్టార్గురించి విమర్శించేంత సంస్కారహీనుడిని కానని పేర్కొన్నారు. కొడాలి నోటి దురుసు కారణంగా గుడివాడలో అన్ని వర్గాలూ దూరమయ్యాయి. అత్యంత కీలకం అయిన కాపు వర్గాన్ని కూడా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిపై ఇష్టారాజ్యంగా మాట్లాడటం ద్వారా దూరం చేసుకున్నారు. ఇప్పుడు తానేమీ చిరంజీవిని అనలేదని చెప్పుకునేందుకు సిగ్గుపడుకండా చిరంజీవి బర్త్ డే వేడుకల్ని నిర్వహించారు.