తెలంగాణా ప్రభుత్వం మొదలుపెడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల వలన దిగువనున్న ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతంలో పంటలకి నీళ్ళు అందక రైతులు తీవ్రంగా నష్టపోతారని వాదిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ఆ మధ్యన రెండు రోజుల నిరాహార దీక్ష చేశారు. ఆ తరువాత ఆయన కానీ వైకాపా నేతలు గానీ వారి మనసాక్షి మీడియా గానీ ఆ ఊసే ఎత్తడం లేదు. ఆ సమస్య పరిష్కారం కాకపోయినా ఆయన దీక్ష వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టుల గురించి చాలా కీచులాడుకొన్నాయి. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాటి గురించి మాట్లాడటం మానేసింది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నేతలెవరూ వాటి గురించి మాట్లాడకపోయినా, తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలు ఆ ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతి, నిర్వాసితుల సమస్యల గురించి తెరాస ప్రభుత్వంతో చాలా గట్టిగా పోరాడుతున్నాయి. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో కెసిఆర్ కుటుంబ సభ్యులు జేబులు నింపుకొంటున్నారని, మల్లనసాగర్, పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితులకి అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
వారికి తెలంగాణా రాజకీయ జేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా వారికి జత కలిశారిప్పుడు. పాలమూరు ప్రాజెక్టు డిజైన్ మార్పులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 21 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి, ఆ ప్రాజెక్టు డిజైన్ లో మార్పు వలన కలిగే లాభ నష్టాల గురించి ఒక సమగ్ర నివేదిక తయారు చేస్తానని అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఇప్పుడు పాలమూరు నిర్వాసితులకి కూడా అండగా నిలబడి ప్రభుత్వంతో పోరాడుతానని హెచ్చరిస్తున్నారు.
ఇదివరకు ఆయన తెరాస పని తీరుని ఆక్షేపించినందుకు అ పార్టీ నేతలు అందరూ ఆయనపై మూకుమ్మడిగా విమర్శలు గుప్పించారు. తద్వారా ఆయన నోరు మూయించాలని అనుకొన్నారు కానీ తెలంగాణా ప్రజల దృష్టిలో చాలా గౌరవం గల ఆయనపై విమర్శలు చేసినందుకు వారే విమర్శలు పాలయ్యారు. అందుకే ఈసారి తెరాస నేతలు ఎవరూ ఇంతవరకు ఆయనపై విమర్శలు చేయలేదు. కానీ ఆయన పాలమూరు ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అప్పుడైనా తెరాస నేతలు తప్పనిసరిగా స్పందించవలసి ఉంటుంది.