తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీఖాన్‌ల పేర్లను కేబినెట్ మరోసారి తీర్మానించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ రెండు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గవర్నర్ తమిళిసైకి పంపించనుంది. ఇంతకు ముందు కూడా ఈ పేర్లను ఖరారు చేశారు. గవర్నర్ ఆమోదించారు. ఇక ప్రమాణ స్వీకారమే తరువాయి అనుకున్న సమయంలో కోర్టు చిక్కులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి వారి పేర్లనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సిఫారసు చేస్తోంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసింది. గవర్నర్ తిరస్కరించారు. అయితే అప్పటి సీఎం కేసీఆర్ మళ్లీ సిఫారసు చేయలేదు. ఎన్నికల్లో ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వం వేరే వారిని సిఫారసు చేసింది. అయితే తమకే చాన్సివ్వాలంటూ.. కుర్ర, దాసోజు కోర్టుకెళ్లారు. విచారణ జరిపిన హైకోర్టు గవర్నర్ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది.
మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని.. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేబినెట్ మరోసారి పేర్లను సిఫారసు చేసింది. అయితే తమకు ఎమ్మెల్సీలు అయ్యే అర్హతలు ఉన్నాయని శ్రవణ్ , కుర్రా సత్యనారాయణ అంటున్నారు. కానీ వారి పేర్లను కాంగ్రెస్ సర్కార్ ఎలా సిఫారసు చేస్తుంది ..?