మహా కూటమిలో భాగంగా సీపీఐకి మూడు అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో రెండు ఎమ్మెల్సీ సీట్లు కూడా ఇస్తామని చెప్పింది. అయితే, నిన్న వెలువడ్డ ఈ ప్రకటనపై సీపీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, ఆ అసంతృప్తిని కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీల ముందుంచారు చాడా వెంకట రెడ్డి. టీజేయస్ అధ్యక్షుడు కోదండరామ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణను చాడా కలుసుకున్నారు. అనంతరం, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో కూడా భేటీ అయ్యారు. పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అంశమై జరుగుతున్న పరిణామాలను చర్చించేందుకే తాము కలిశామని చాడా మీడియాతో చెప్పారు.
సీట్ల సర్దుబాటుకి సంబంధించి నిన్న వెలువడ్డ ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశామన్నారు చాడా. సీట్ల కేటాయింపు ఏకపక్షంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అన్నారు. ఇలాంటి పద్ధతి ఉంటుందని కూటమి ఏర్పాటు సందర్భంలో తాము అనుకోలేదన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలనీ, గౌరవప్రదమైన ఒప్పందాలు ఉండాలని అనుకున్నామని చెప్పారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. సీపీఐ బలమైన పార్టీ అయినప్పటికీ ఈ పొత్తులో సీట్ల సర్దుబాటులో అన్యాయం జరిగిందన్నారు. నల్గొండ తమకు బలమైన ఉద్యమం ఉన్న జిల్లా అనీ, కానీ అక్కడ ఒక్క సీటూ లేదన్నారు. కొత్తగూడెం లాంటి చోట ప్రాతినిధ్యం లేకపోవడం, ఇతర జిల్లాల్లో పట్టున్న ప్రాంతాల్లో తమకు అవకాశం ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు. తాము అడిగినవి కేవలం ఐదు సీట్లు మాత్రమేననీ, అయినా సరే మూడు మాత్రమే ఇవ్వడం అన్యాయమని జానారెడ్డి దృష్టికి తీసుకెళ్లామనీ, దీన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారని చాడా చెప్పారు. తాము సీట్ల కోసం ప్రాథేయపడటం లేదనీ, అసంతృప్తి వ్యక్తం చేశామన్నారు.
సీపీఐకి కొత్తగూడెం సీటు ఒక్కటీ ఇచ్చినా ఇప్పుడున్న ఈ టెన్షన్ వాతావరణం ఒక కొలీక్కి వస్తుంది. వారి పట్టు కూడా అదే. కానీ, అలా ఇచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ లేదు. కానీ, టీజేయస్, టీడీపీలతో పోల్చితే కాంగ్రెస్ అధినాయకత్వంపై సీపీఐ ఒత్తిడి క్రమంగా పెంచిందనే చెప్పాలి. అంతేకాదు, సీట్ల కేటాయింపులపై తమ డిమాండ్లపై స్పందించాలంటూ రేపు సాయంత్రం వరకూ కాంగ్రెస్ పార్టీకి సీపీఐ గడువు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, శనివారం సాయంత్రానికి పరిస్థితి అంతా కొలీక్కి వచ్చేస్తుందన్న ధీమా కాంగ్రెస్ వర్గాల నుంచి వ్యక్తమౌతోంది.