సింగరేణి ఎన్నికల్లో టిబిజికెఎస్ విజయం తర్వాత ముఖ్యమంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చ మొత్తం దారి తప్పినట్టయింది. జెఎసిని, ప్రతిపక్షాలనూ రకరకాలుగా అవహేళన చేయడంపై అన్ని వైపుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వాడు, వీడు, లంగ, తొక్క, కుక్క వంటి పదాలతో కోదండరాంను, దొంగ దరిద్రుడు వంటి పదాలతో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత జానారెడ్డిని తిట్టిపోయడం బాగాలేదన్న భావనే అందరిలో వ్యక్తమైంది. దానికి తగినట్టే ఈ రోజు వరుసగా జానారెడ్డి, కోదండరాం, రేవంత్ రెడ్డి వంటివారంతా ఆ దాడిని ఖండించడమే గాక అనేక సవాళ్లు విసిరారు. తనకు మంత్రి పదవి రానందుకే తెలంగాణ ఫోరం ఏర్పాటు చేసి ఆయన సహాయం కోరినట్టు చెప్పడాన్ని కెసిఆర్ నిరూపించాలని జానారెడ్డి సవాలు చేశారు. ఆ రోజు ఆయనకు నాతో మాట్లాడేంత స్థాయి స్తోమత లేవని కూడా అన్నారు. దరిద్రుడు దొంగ వంటి మాటలు జుగుప్సకొల్పుతున్నట్టు చెప్పి వదిలేశారు. ఇక కోదండరాం తనదైన శైలిలో సమ్యలపై ప్రభుత్వ విధానాలు తప్పుగా వున్నాయి గనక పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. తనను ఆ నాటి పరిస్థితుల్లో చైర్మన్గా ఎన్నుకోవడానికి దారితీసిన పరిస్థితులను జెఎసి ఆధ్వర్యంలో జరిగిన విశాల ఉద్యమాన్ని గుర్తు చేస్తూ ఏ ఒక్కరి వల్లనో తెలంగాణ రాలేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం జెఎసి ఉద్యమిస్తూనే వుంటుందని చెప్పడమే గాక ఇప్పుడు పరిపాలనా విధానాలూ లోపభూయిష్టంగా వున్నాయనీ, నిధులు దుర్వినియోగమవుతున్నాయని అనేక ఉదాహరణలిచ్చారు. మొత్తంపైన విజయం వల్ల కలిగిన వాతావరణాన్ని కెసిఆర్ చేజార్చుకున్నారనే భావం పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆయనలో అంత అసహనానికి కారణం అభద్రతా భావన అన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. సింగరేణి ఎన్నికల్లోనూ వచ్చిన ఓట్ల శాతంలో తగ్గుదల, నల్గొండపై సర్వేలోనూ సూటిగా బలపర్చేవారు యాభై శాతం దాటకపోవడం చూస్తే తెలంగాణ రాజకీయాల్లో మిశ్రమ సంకేతాలు కొనసాగుతున్నట్టే చెప్పుకోవాలి.