తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి ఓటమిపై మాట్లాడారు తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు కె. కోదండరామ్. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా కూటమి అజెండాను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడంలో వైఫల్యం చెందామన్నారు. ఓటమి కారణాల్లో ఈవీఎమ్ ల పనితీరుపై కాంగ్రెస్, టీడీపీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని కోదండరామ్ కొట్టిపారేశారు. ఈవీఎమ్ ను ఓటమికి కారణంగా చూడకూడదన్నారు. రాజకీయంగా వ్యూహాల్లో ఎక్కడ వైఫల్యం చెందామనేది చర్చించాలిగానీ, ఇలాంటి కారణాలపై విశ్లేషణ అనవసరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమికి మంచి ఊపు వచ్చినా, ఎందుకు ఓటమి వచ్చిందనేది అన్ని పార్టీలూ కూర్చుని చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
తెరాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం తీరు ఎలా ఉంటుందో తనకు అవగాహన ఉందనీ, కొన్నాళ్లపాటు ఆయనతో కలిసి పనిచేశాను కాబట్టి వ్యూహాలు ఎలా ఉంటాయో తనకు అవగాహన ఉందన్నారు కోదండరామ్. అందుకే, సీట్ల సర్దుబాటు వీలైనంత త్వరగా ముగించేసి… ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తాను కాంగ్రెస్, టీడీపీలకు పదేపదే చెబుతూ వచ్చానన్నారు. రెండు వారాలు సరిపోతాయని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారనీ, మూడు వారాలు చాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారని కోదండరామ్ చెప్పారు. సమయం సరిపోక పోవడం వల్లనే కూటమి అజెండా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామన్నారు. కొంతమంది అభ్యర్థుల ఎంపికలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించలేదనీ, ప్రచారంలో కూడా సరైన వ్యూహాలు అవలంభించలేదన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయలేకపోయామన్నారు. ఎన్నికలకు ముందు కూటమికి ప్రజల నుంచి మంచి స్పందన ఉండటంతో… చాలామంది అభ్యర్థులకు గెలుపు ధీమా వచ్చేసిందనీ, కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయారని వ్యాఖ్యానించారు.
ఎల్. రమణ, ఉత్తమ్ లు వ్యూహాత్మంగా ముందుకు సాగలేదనేదే అంశాన్నే కోదండరామ్ బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. కేసీఆర్ వ్యూహాలను తిప్పి కొట్టడంలో తన అనుభవాన్ని ప్రజా కూటమి పూర్తిస్థాయిలో వినియోగించే అవకాశం ఇవ్వలేదనే అభిప్రాయం కూడా ఆయన మాటల్లో కనిపిస్తోంది. మరి, ఆయన చెబుతున్నట్టుగా… కూటమి పక్షాలన్నీ ఒకచోట సమావేశమై అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషించుకుంటాయో లేదో చూడాలి.