తెలంగాణలో మహాకూటమి ఏర్పడింది. కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా… ఈ కూటమిలో పార్టీలు చేరాయి. మహాకూటమి దిశగా తొలి అడుగులు వేగంగానే పడ్డాయి. కానీ రెండో దశ అంటే సీట్ల పంపకం దగ్గర పీడ ముడి పడే ప్రమాదం కనిపిస్తోంది. పొత్తుల కోసం కాంగ్రేస్..టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు ప్రాథమిక చర్చలు సైతం పూర్తి చేశాయి. ఇక సీట్ల సర్దుబాటు పై అడుగులు ముందుకు పడాల్సి ఉంది. అందుకోసం పార్టీలన్నీ ప్రతిపాదనలు సిద్దం చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇరవై స్థానాలు, సీపీఐ ఎనమిది స్థానాలు, టీజేఎస్ పదిహేను స్థానాల్లో పోటీచేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకోసం ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. పొత్తుల చర్చలకోసం సిద్ధమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా కాంగ్రేస్ వైపు నుంచి అందుకు భిన్నమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అన్ని పార్టీలకు ఇరవైకి మించి స్థానాలు ఇవ్వకూడదన్న ఆలోచనతో హస్తం పార్టీ ఉంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా గెలిచే స్థానాలువదులుకోకూడదంటూ హితువు చెప్పారు. ఈనేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం కూడా అదే విషయాన్ని పదేపదే చెబుతోంది.
గెలిచే స్థానాలను మిత్రపక్షాలను ఇవ్వాలనుకుంటున్నారు. జూబ్లిహిల్స్, శేరిలింగం పల్లి, కూకట్ పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కుద్బుల్లాపూర్, రాజేంద్రనగర్ స్థానాలను టీడీపీ అడుగుతోంది. అయితే అక్కడ కాంగ్రేస్ కు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, బిక్షపతి యాదవ్, సుధీర్ రెడ్డి, కూనాశ్రీశైలం గౌడ్, మాజీ మంత్రి సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి వంటి బలమైననాయకులున్నారు. జిల్లాల్లో కూడా టీడీపీ అడుగుతోన్న స్థానాల్లో కాంగ్రేస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటం పొత్తులకు ఇబ్బందిగా మారే అవకాశంఉంది. ఇక కొత్తగూడెం, హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా, దేవరకొండ,మునుగోడు నియోజకవర్గాలను సీపీఐ కోరుతోంది. గత ఎన్నికల్లో ఐదో స్థానంలో నిలిచిన సీపీఐ కి కొత్తగూడెం ఇవ్వొద్దంటూ ఇప్పటికే అక్కడి కాంగ్రేస్ నేత వనమా వెంకటేశ్వరరావ్ ఆందోళన బాటపట్టారు. వైరాది కూడా అదే పరిస్థితి. హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి బలమైన అభ్యర్థిగా కాంగ్రేస్ భావిస్తోంది. టీజేఎస్ అడుగుతోన్న చోట కూడా కాంగ్రేస్ పార్టీ అభ్యర్థులే బలంగా ఉన్నారన్న భావనలో హస్తం పార్టీ ఉంది. ఇన్ని స్థానాలను సర్ధుబాటు చేసుకోవడం కూటమీ పార్టీలకు తలనొప్పిగా మారబోతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రేస్ గెలిచే స్థానాలను వదులుకోమంటూ ప్రకటనలు చేస్తోంది. మిత్ర పక్షాలకు ముందే హింట్ ఇచ్చే ప్రయత్నంచేస్తోంది. మరి వాటిని మిత్రపక్షాలు వదులుకోవడానికి సిద్దపడతాయా.. అనేది ప్రశ్నార్థకం.
సీట్ల సర్ధుబాటు పక్కనపెడితే కోదండరాం పెడుతున్న షరతులు కాంగ్రెస్కు నచ్చడం లేదు. మహాకూటమికి కామన్ మినిమమ్ ప్రోగ్రాం పెట్టి.. అధికారంలోకి వస్తే దాన్ని ప్రత్యేక కౌన్సిల్ గా మార్చి చట్టబద్దత కల్పించాలని కోదండరాం కోరుతున్నారు. దానికి తనను చైర్మన్ గా చేయాలంటూ కండిషన్స్ పెడుతున్నారు. కోదండరాం పార్టీ పెడుతోన్న షరతులకు టీటీడీపీ, సీపీఐ నేతలు ఓకే చెబుతోన్నా..కాంగ్రేస్ పార్టీ మాత్రం అందుకు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఓ వైపు సీట్ల సర్ధుబాటు, మరోవైపు టీజేఎస్ వైఖరి మహాకూటమికి ప్రాథమిక దశలోనే సంకటంగా మారుతున్నాయి. వీటన్నిటినీ అధిగమిస్తేనే.. కూటమికి ఓ రూపు వస్తుంది.