ప్రజా కూటమి సీట్ల కేటాయింపులు పూర్తయ్యాయి. కాకపోతే, కోరుకున్న సీట్లు దక్కలేదనే అసంతృప్తి తెలంగాణ జన సమితిలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతోపాటు, ఈ మొత్తం పొత్తు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై కోదండరామ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. చివరి నిమిషం వరకూ భాగస్వామ్య పక్షాలకు ఇస్తామన్న సీట్లపై స్పష్టత ఇవ్వకుండా, తాము వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనే లక్ష్యాన్ని కాంగ్రెస్ కొంతవరకూ నెరవేర్చుకుంది. అయితే, ఈ క్రమంలో భాగస్వామ్య పక్షాల నుంచి అసంతృప్తులు లేకుండా చేసుకోలేకపోయిందనడంలో సందేహం లేదు.
కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ… తమకు 8 సీట్లు ఇస్తామని చెప్పారనీ, చివరికి 6తో సరిపెట్టారంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులు నామినేషన్లు వేసిన నియోజక వర్గాల్లో, వారి అభ్యర్థులతో వేసిన నామినేషన్లను కాంగ్రెస్ ఉపసంహరించుకుంటుందనే ఆశాభావంతో ఉన్నామన్నారు. జనగామ సీటు విషయంలో కూడా తాను పట్టుబట్టలేదనీ, అందర్నీ ఒప్పించగలిగితే మాత్రమే పోటీ చేస్తానని మొదట్నుంచీ స్పష్టంగా చెప్పాను అన్నారు. బీసీల కోసమే ఆ స్థానాన్ని వదులుకున్నామని స్పష్టం చేశారు. మిర్యాలగూడ సీటును తమకు ఇవ్వాలని కోరామనీ, కానీ అక్కడ ఆర్. కృష్ణయ్యను రంగంలోకి దించారన్నారు. ఆయన్ని పోటీకి పెడుతున్నట్టుగా తమకు ముందుగా ఎలాంటి సమాచారమూ కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు. పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పాటించలేదనీ, సీట్ల సర్దుబాటు ప్రక్రియపై తమకు అసంతృప్తి ఉందన్నది ముమ్మాటికీ వాస్తవం అన్నారు.
ఒక బలమైన అసంతృప్త వాయిస్ ను మహా కూటమిలో కాంగ్రెస్సే తయారు చేసిందని చెప్పొచ్చు! కోదండరామ్ పార్టీ విషయంలో పొత్తు అనుకున్న దగ్గర్నుంచీ కాంగ్రెస్ ఒక వ్యూహం అనుసరించింది. వారికి చెప్పిందొకటీ, చేసింది మరొకటి అన్నట్టుగా డీల్ చేసింది. దీంతో కోదండరామ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పోనీ… ఇంత జరిగాక, ఆయనలో ఉన్న అసంతృప్తిని ఈ తరుణంలో ఇలా పదేపదే బహిర్గతం కాకుండా ఉండేలా అయినా కాంగ్రెస్ జాగ్రత్త తీసుకోలేకపోయిందనీ అనొచ్చు! అయితే, ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే… తమ పట్ల కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ ఒక తీరుగా వ్యవహరిస్తున్నా… ఇప్పటికీ కలుపుకుని పోయే ధోరణిలోనే కోదండరామ్ ఉన్నారు. కానీ, కాంగ్రెస్ నుంచే అలాంటి సంకేతాలు కనిపించడం లేదు. కనీసం టీజేయస్ పోటీ చేసిన స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థులను వెనక్కి తగ్గిస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఇక్కడా కాంగ్రెస్ వ్యవహార శైలి మారపోతే… కోదండరామ్ అసంతృప్తి ఎలాంటి మలుపు తీసుకుంటుందో మరి.