తెలంగాణలో వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ ఓ సమస్యగా మారింది. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వ ఉద్దేశం ఒకలా ఉంది. నిర్వాసిత రైతుల డిమాండ్ మరోలా ఉంది. 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని పలు ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయే రైతులు డిమాండ్ చేస్తున్నారు. వారి వాణిని వినిపించడంలో జె.ఎ.సి. కీలక పాత్ర పోషిస్తోంది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కాళేశ్వరం, మల్లన్న సాగర్, రాచకొండ, సింగూరు ప్రాజెక్టుతో పాటు ఓపెన్ కాస్ట్, విమానాశ్రయ నిర్మాణానికి స్థలాలను కోల్పోయే రైతులతో జేఏసీ హైదరాబాదులో ఓ సదస్సు ఏర్పాటు చేసింది. గిరిజనుల నుంచి భూములను తీసుకుంటున్న ప్రభుత్వం తగిన పరిహారం ఇవ్వడం లేదని కొమురం భీమ్ వారసుడితో సహా ఎంతో మంది ఎస్టీలు విమర్శించారు.
సాంకేతిక నిపుణులు, సామాజికవేత్తలతో ఓ కమిటీని వేసి అధ్యయనం చేసిన తర్వాతే భూసేకరణ జరపాలనేది జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్. అప్పటి వరకూ భూసేకరణ నిలిపివేయాలని ఆయన కోరుతున్నారు. ఈనెల 10 నుంచి అన్ని గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత కలెక్టరేట్ల ముందు ధర్నాలకు జేఏసీ ప్లాన్ చేసింది. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద బహిరంగ సభకు కూడా సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే పలు ప్రాజెక్టుల పరిహారం విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తప్పు పట్టింది. భూముల పరిహారాన్నే అస్త్రంగా చేసుకుని జేఏసీ పల్లెపల్లెకూ చొచ్చుకుని పోతోంది. మరి భూసమస్యకు పరిష్కారం ఏమిటో, ప్రాజెక్టులను అనుకున్న ప్రకారం పూర్తి చేయడం ఎలాగో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.