హైదరాబాద్: తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తప్పుబట్టారు. రైతుల ఆత్మహత్యల నిరోధానికి ముఖ్యమంత్రి ప్రయత్నించటంలేదని అన్నారు. ఢిల్లీలో ఆల్ అస్సామ్ స్టూడెంట్స్ యూనియన్(ఆసు) ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన చిన్న రాష్ట్రాల సదస్సులో కోదండరామ్ పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానంలో ఉందని, విదర్భ తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరగడంలేదనే వాదనలో నిజంలేదని, నిరుడు 800మంది రైతులు చనిపోయారని కేంద్రప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని అన్నారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ గత ప్రభుత్వాల ప్రభావమే కారణమని చెప్పారు. ఆత్మహత్యల నిరోధానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించటంలేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆత్మహత్యల నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు.
దేశంలో మరిన్ని చిన్న రాష్ట్రాలు రావాల్సిన ఆవశ్యకత ఉందని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏర్పడే చిన్న రాష్ట్రాలకు తెలంగాణ సమాజం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి దత్తాత్రేయతో కలిసి కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోదండరామ్ కలిశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. హైకోర్టును తక్షణమే విభజించాలని కోరారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు, కేసీఆర్కుమధ్య ప్రస్తుతం సంబంధాలు సరిగా లేకపోయినప్పటికీ ఇంతవరకు అది మీడియాకెక్కలేదు. కోదండరామ్ బహిరంగంగా కేసీఆర్‌ను విమర్శించటం, అదీ ఢిల్లీలో జరగటం విశేషం. కేసీఆర్ విమర్శకులకు కోదండరామ్ వ్యాఖ్యలు ఊతమిచ్చినట్లవుతుంది.