తెలంగాణ జె.ఎ.సి. చీఫ్ ప్రొఫెసర్ కోదండ రామ్ పై తెరాస నేతలు విమర్శలు చేసే కొద్దీ ఆయనకు మద్దతు పెరుగుతోంది. బంతిని నేలకేసి కొడితే నింగివైపు ఎగిసినట్టు, మంత్రులు, ఇతర నాయకులు ఆయన్ని తిట్టే కొద్దీ సానుభూతి పెరుగుతోంది.
కేసీఆర్ రెండేళ్ల ప్రభుత్వ పనితీరపై పెదవి విరిచిన కోదండ రామ్ అభిప్రాయం కరెక్టే అనే వారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన చెప్పినదాంట్లో ఒక్కో పాయింట్ ప్రకారం వాస్తవాలను అంగీకరిస్తూ తెరాస నేతలు మాట్లాడితే మరోలా ఉండేది. అలా కాకుండా, తమకు పదవినిచ్చిన కేసీఆర్ ముందు మార్కులు కొట్టేయాలనే తపనతో కొందరు నేతలు, మంత్రులు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు. మరికొందరు మర్యాద ఇస్తూనే విమర్శలు గుప్పించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ స్థాపించిన పార్టీ ఏనాడూ పూర్తి స్థాయిలో జనామోదం పొందలేదు. కొన్ని జిల్లాలు, కొన్ని ప్రాంతాలకు, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైంది. జె ఎ సి ఆవిర్భవించిన తర్వాతే ఉద్యమం నగరం నుంచి పల్లెల వరకూ విస్తరించింది. వయో వృద్ధుల నుంచి బడికెళ్లే పిల్లల వరకూ అంతా ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
ఊరూరా ఉద్యమం దైనందిన జీవితంలో ఓ భాగమైంది. ఏ ఊళ్లో చూసినా టెంట్లు కనిపించాయి. బతుకమ్మలు ఆడుతూ, ఆటపాటలతో ఉద్యమ వ్యాప్తికి ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చారు. మిలియన్ మార్చ్ వంటి భారీ కార్యక్రమాలను ఒంటి చేత్తో విజయవంతం చేసిన ఉద్యమ నేతగా కోదండరామ్ ప్రశంసలు పొందారు.
తెరాస నేతలు ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు. కేసీఆర్ తమకిచ్చిన పదవులే వారికి కనిపిస్తున్నట్టున్నాయి. ఆ పదవులు రావడానికి కారణం తెలంగాణ రావడం. అందుకు ప్రధాన కారకుల్లో కోదండరామ్ ఒకరు. తెరాస నేతల విమర్శలు శ్రుతి మించిన తర్వాత, యువతలో కోదండరామ్ కు భారీగా మద్దతు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మద్దతు ప్రకటనలే దీనికి నిదర్శనం.
కోదండ రామ్ పై దండెత్తిన వారంతా ఏదో ఒక పదవిలో ఉన్నవారే. పదవిలో లేని తెరాస నేతలు ఇలా విమర్శల దాడి చేయడం లేదు. ఇటీవల వచ్చిన ఇతర పార్టీల వారికి పిలిచి పీట వేయడం నచ్చని ఎంతో మంది తెరాస విధేయ నాయకులు, కార్యకర్తలకు కేసీఆర్ వైఖరి మింగుడు పడటం లేదు. అందుకేనేమో, అలాంటి వారెవరూ కోదండ రామ్ ను తిట్టడం లేదు. అంటే, తెరాసలోనూ కోదండ రామ్ ను సమర్థించే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారనేది పరిశీలకుల అభిప్రాయం. తెరాస నేతలు ఇంకా ఈ విషయాన్ని సాగదీస్తే కోదండరామ్ ను మరింత బలోపేతం చేయడమే అనేది వారి విశ్లేషణ.