పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చివరి వరకూ ఒక నాన్చుడు ధోరణిని ప్రదర్శించడంపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ కొంత అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాట్లు ఎలా ఉన్నా… కూటమితో కలిసి కదలాల్సిన ఒక అనివార్యత ఉంది కాబట్టి సర్దుకున్నామని అంటున్నారు. ఉన్న కొద్దిరోజుల వ్యవధిలో రాష్ట్రమంతా వీలైనన్ని ప్రాంతాల్లో పర్యటిస్తా అన్నారు. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోదండరామ్ కొన్ని అంశాలపై సవివరంగా మాట్లాడారు.
బయటకి ఒకటి చెప్పి, ఆ తరువాత లోలోపలి నిర్ణయాలు మరోలా ఉండేలా రాజకీయాలు చేయడం తనకు చేతగాదన్నారు. తమ విషయంలో కాంగ్రెస్ అలా చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఆలస్యం చేయడం వల్ల ఒక గొప్ప అవకాశాన్ని తగ్గించారన్నారు! అదేంటంటే… అసెంబ్లీ రద్దు తరువాత తెరాసపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందనీ, తెరాస అభ్యర్థులపై ప్రజలు మండిపడ్డ దృశ్యాలూ మీడియాతోపాటూ సోషల్ మీడియాలో కూడా ప్రముఖంగా చూశామన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఆ స్థాయిలో ఉన్నప్పుడు… అదే సమయంలో వారి పోరాటానికి కూటమి ఆసరాగా నిలబడితే బాగుండేదన్నారు. కాంగ్రెస్ చేసిన ఆలస్యం కారణంగా… ప్రజల్లో తీవ్రంగా ఉన్న ఆగ్రహాన్ని తగ్గించి, మరో అవకాశం తమకు ఇవ్వండీ అంటూ కేసీఆర్ బతిమాలి, ప్రజలను కొంత తమవైపు తిప్పుకోగలిగారు అన్నారు కోదండరామ్.
కేసీఆర్ కి మహా అయితే 15 సీట్లు మాత్రమే వచ్చేవనీ, కానీ గడచిన పదిరోజుల తీరు వల్ల 35 వరకూ అవకాశం ఇచ్చినట్టయిందన్నారు కోదండరామ్. అయితే, ఇప్పుడు కూటమి గట్టిగా ప్రయత్నిస్తే తెరాసకి పదిహేనుకు మించవన్నారు. క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందనీ, తాను స్వయంగా ప్రజల్లోకి వెళ్లి చూశాననన్నారు. చాలా వర్గాలను కేసీఆర్ దూరం చేసుకున్నారన్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో తెరాస ఒక్క సీటూ గెలవలేదన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒకటీ రెండుకి మించి తెరాసకి రావని జోస్యం చెప్పారు. కేసీఆర్ మీద నెగెటివ్ వేవ్ చాలా బలంగా ఉందనీ, దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వంద సీట్లకు తగ్గమనే ప్రచారం చేసుకుంటున్నారు అన్నారు.
చాలా కాన్ఫిడెంట్ తెరాస ఓటమి ఖాయమని చెప్తున్నారు కోదండరామ్. నిజానికి, వంద సీట్ల సంగతి ఎలా ఉన్నా… ఎలాగోలా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మ్యాజిక్ ఫిగర్ ను తెరాస దాటేస్తుందన్న అంచనాలున్నాయి. కానీ, అవేవీ వాస్తవాలు కాదని కోదండరామ్ కొట్టిపారేయడం గమనార్హం. కోదండరామ్ ఒక ఫక్తు రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, ఆయన అంచనాలూ లెక్కల్ని అంత ఈజీగా ఎవ్వరూ తీసి పారేయలేరు కదా!