హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ఈ నెల 15న జరిగిన ఎన్కౌంటర్ తప్పు అని అలాంటి ఘటనలు జరగకూడదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. మావోయిస్టులను తీసుకొచ్చి కాల్చినట్లే ఉందని వ్యాఖ్యానించారు. ఇది నష్టదాయక పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తున్నానని చెప్పారు. ఇటువంటి ఘటనలవల్ల సమాజానికి నష్టం జరుగుతుందని అన్నారు. సమాజం హింసలోకి వెళ్ళే ప్రమాదముందని చెప్పారు. ప్రభుత్వం దీనిని గమనించాలని సూచించారు. మావోయిస్ట్ సమస్యను చట్టపరంగా, రాజకీయపరంగానే పరిష్కరించాలి తప్పితే హింసవలన సమస్య పరిష్కారం కాదని అన్నారు.
మరోవైపు కోదండరామ్ ఈ నెలాఖరుకు యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగానికి పదవీ విరమణ చేయబోతున్నారు. అయితే రాజకీయాలలో చేరబోనని, ప్రజా సమస్యలపై పోరాడుతుంటానని ఆయన ఇవాళ ఓ టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉద్యోగ బాధ్యతలనుంచి విముక్తి లభించింది కాబట్టి పూర్తిస్థాయిలో ప్రజా సమస్యలపై దృష్టి పెడతానని అన్నారు. విభజన ప్రక్రియ నత్తనడక నడుస్తుందని, దానిపైనే మొదట దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ, ఏ పార్టీ దీనికి మినహాయింపు కాదని, తను చేస్తే లౌక్యం-ఎదుటివారు చేస్తే మోసం అంటున్నాయని అన్నారు.