తెలంగాణలో టీఆర్ఎస్ ఓడించడానికి ఏర్పాటైన మహాకూటమి నుంచి తెలంగాణ జనసమితి వైదొలుగుతోందన్న వార్తలన్నీ.. వట్టి ప్రచారమేనని… కోదండరాం తేల్చేశారు. ఈ రోజు.. హైదరాబాద్ గోల్కొండ హోటల్లో జరిగిన మహాకూటమి భేటీకి ఆయన హాజరయ్యారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మహాకూటమి ఉంటుందని కోదండరాం ప్రకటించారు. అక్టోబర్ 2 నాటికి కామన్ ప్రోగ్రాం తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సమావేశం తర్వాత కోదండరాం ప్రకటించారు. టీఆర్ఎస్ను ఓడించడమే మహాకూటమి ప్రధాన లక్ష్యమన్నారు. సీట్ల కేటాయింపుపై అసంతృప్తితో బీజేపీతో చర్చలు జరుపుతున్నాన్న వార్తలకు కోదండరాం పుల్ స్టాప్ పెట్టారు. సీట్లకు సంబంధించి ఇంతవరకు చర్చ జరగలేదని ప్రకటించారు. త్వరలో కూటమి పేరు కూడా నిర్ణయిస్తామన్నారు. ప్రస్తుతం మేనిఫెస్టోపై చర్చ జరుగుతుందని.. ఆ తర్వాత అభ్యర్థుల విషయంపై చర్చిస్తామన్నారు. .
గోల్కోండ హోటల్ లో జరిగిన మహాకూటమి సమావేశానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్, టీ టీడీపీ నేత ఎల్. రమణ, సీపీఐ చాడ వెంకటరెడ్డి కూడా హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా మహాకూటమి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌పై చర్చించారు. ధనిక రాష్ట్రంగా ఏర్పాడ్డ తెలంగాణను అప్పులపాలు చేశారని టీ టీడీపీ నేత ఎల్.రమణ విమర్శించారు. విపక్షాల ఐక్యతను టీఆర్ఎస్ ఓర్వలేక పోతోందని మండిపడ్డారు. త్వరలో కేసీఆర్ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభిస్తుందని జోక్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఉత్తమ్ కమార్ రెడ్డి తేల్చారు. ప్రభుత్వం రద్దయిన తర్వాత శంకుస్థాపనలు చేస్తున్నా… ఎన్నికల కమిషన్, గవర్నర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్పై చర్యలు తీసుకోవాలని ఈసీ,రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. మహాకూటమిలోకి రావాలని మిగతా పార్టీలను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. ఒకే ఎజెండాతో మహాకూటమి ముందుకు వెళ్తుందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు.
సీట్ల సర్దుబాటు గురించి ఇంకా చర్చలు ప్రారంభం కాలేదని.. జనసమితి అధనేత కోదండరాం స్పష్టంగా ప్రకటించారు. అయితే మూడు సీట్లంటూ.. జరిగిన ప్రచారం పై ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. ఉమ్మడి లక్ష్యం.. కేసీఆర్ ను ఓడించడమే అయినా… తన పార్టీ రాజకీయ ప్రాధాన్యతను కాపాడుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. బీజేపీ వైపు చూడకపోయినా… ఆయన మెరుగైన స్థానాల కోసం… కాంగ్రెస్ పై ఒత్తిడి చేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.