ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రామగుండం.. సాధారణగా అత్యధిక ఉష్ణోగ్రతలతో రికార్డులకు ఎక్కుతూ ఉంటుంది. ఈ సారి రాజకీయ వేడి కూడా ఆ స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మహాకూటమిలో భాగంగా రామగుండం టీజేఎస్ కోటాలోకి వెళుతుందని, కోదండరాం ఇక్కడి నుంచి పోటీకి దిగుతున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయ్యింది. కోదండరాంను అసెంబ్లీలోకి రాకుండా చేయాలన్న పట్టుదలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. రెబల్స్ బెడదతో రామగుండాన్ని అంతగా పట్టించుకోని టీఆర్ఎస్ కోదండరాం రామగుండం నుంచి పోటీ చేస్తున్నారన్న ప్రతిపాదనతో అలర్ట్ అయ్యింది. స్వయంగా కేసీఆరే రామగుండం నియోజకవర్గ వ్యవహారాన్ని టేకప్ చేశారు. ఓ టీం ప్రత్యేకంగా రామగుండంపై దృష్టి పెట్టింది.
టీజేఎస్‌కు సింగరేణి కార్మికుల్లో ఉన్న ఆదరణ ఎంత, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వలసాంధ్రులు ఎంతమంది, టీడీపీ, సీపీఐ, ఏఐటీయూసీ ఏ మేరకు ప్రభావం చూపుతుందనే అంశాలను శాస్ర్తీయంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ శ్రేణులు కోదండరాంకు ఏ విధంగా సహకరిస్తాయో అనే అంశాలపై విశ్లేషణ చేస్తున్నాయి. రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థి సత్యనారాయణను గెలిపించుకునేందుకు హరీష్‌రావు లేదా కేటీఆర్‌లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. సింగరేణిలో కార్మికుల ఆదరణ ఉందని పొత్తులో ఏఐటీయూసీ మద్దతు ఉంటుందని కోదండరాం రామగుండాన్ని ఎంచుకున్న నేపధ్యంలో అందుకు కౌంటర్‌గా టీఆర్ఎస్ బలాన్ని ఇప్పటి నుంచే ఆ పార్టీ అంచనా వేస్తున్నది. రామగుండం నియోజకవర్గ పరిధిలోని ఆర్.జీ-1, 2 పరిధిలో టీబీజీకేఎస్సే ప్రాతినిధ్య, గుర్తింపు సంఘంగా ఉండటం, టీబీజీకే ఎస్ కేంద్రకార్యాలయం, నాయకత్వం రామగుండం కోల్బెల్ట్పైనే దృష్టి సారించే విషయంపై బేరీజు వేస్తున్నట్టు తెలుస్తున్నది. కోదండరాం రామగుండం బరిలో ఉంటే టీఆర్ఎస్ రెబల్‌గా ఉన్న కోరుకంటి చందర్, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణిల అంశాలపై టీఆర్ఎస్ ప్రత్యేక శ్రద్ధ, వ్యూహలను అవలంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోదండరాం రామగుండం నుంచి పోటీ చేస్తే జిల్లాలోని మంథని, పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మంట్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. రామగుండం నుంచి కోదండరాం పోటీ చేస్తే ఓడిస్తామని రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ ఇప్పటికే సవాల్ విసిరారు. రెండురోజుల క్రితం తిలక్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో కోదండరాంను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. స్థానికేతరుడని, ఇక్కడి ప్రజా సమస్యలు ఎప్పుడైన పట్టుంచుకున్నాడా అంటూ సత్యనారాయణ విమర్శించారు.
రామగుండం టీజేఎస్‌కు కేటాయిస్తారనే సమాచారంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలయ్యింది. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడంలేదు. బీ పవర్‌హౌస్ పునరుద్ధరణ, మెడికల్ కళాశాల తదితర అంశాలపై పోరాటాలు నిర్వహించి గడపగడప కాంగ్రెస్ పేర కొంత జనంలోకి వచ్చింది. కాంగ్రెస్‌లో అభ్యర్థిత్వం కోసం జరిగిన ప్రహసనం అంతా ముగిసిపోయి ఏఐసీసీకి వెళ్లిన ప్రతిపాదనల్లో రామగుండం నుంచి ఒక రాజ్‌ఠాకూర్ పేరే వెళ్లింది. దీంతో రామగుండం టిక్కెట్ రాజ్ఠాకూర్కే అని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయానికి వ చ్చాయి. ఆకస్మాత్తుగా కోదండరాం పేరు ప్రతిపాదనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్య కర్తలు కలవరానికి గురవుతున్నారు.