కేసీఆర్పై ఒకే ఒక్క అభ్యర్థిని పెట్టి ఓడించాలన్న సూచనలు విపక్షాల్లో వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ కు ఒక్క పార్టీతో కూడా స్నేహం లేదు. అన్ని పార్టీలూ వ్యతిరేకమే. కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యంతో అన్ని పార్టీలూ ఉన్నాయి. అంటే.. అందరూ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టాడనికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అందుకే ఒకే అభ్యర్థి ఆలోచన తెరపైకి వచ్చింది. ఏదో ఓ పార్టీ రాజకీయ నాయకుడు అయితే ఎవరూ మద్దతివ్వరు. అందుకే న్యూట్రల్ ఇమేజ్ ఉన్న నేత కావాలి. ఆ నేత కోదండరాం అవుతారన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది
తెలంగాణ రాష్ట్ర సాధన పూర్తిగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం ద్వారా జరిగింది. ఈ జేఏసీ వెనుక కేసీఆర్ కీలకశక్తి కానీ తెర ముందు ఉండి నడిపించింది మాత్రం ప్రొఫెసర్ కోదండరాం. కారణాలు ఏవైతేనేం… ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ కు దూరమయ్యారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు ఎందరో కీలక పదవుల్లో ఉన్నారని.. కోదండరాంకు ఏం తక్కువన్న సానుభూతి ఉద్యమకారుల్లో , ప్రజల్లో ఉంది. అదే సమయంలో కేసీఆర్ ఎన్ని పదవులు ఆఫర్ ఇచ్చినప్పటికీ తిరస్కరించి పోరాట పంధా ఎంచుకున్నారన్న మంచి పేరు ఉంది. దీంతో ఆయనే కేసీఆర్కు సరైన ఉమ్మడి ప్రత్యర్థి అవుతారన్న అంచనాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్ ఒకే అభ్యర్థికి మద్దతివ్వవు. కానీ పార్టీల ముద్ర లేదు కాబట్టి కోదండరాంకు మద్దతిచ్చి…. కేసీఆర్ పై పోటీ పెట్టడం లేదని చెప్పవచ్చు. . తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన కోదండరాం లాంటి వారు అసెంబ్లీకి రావాల్సి ఉందని ప్రజలకు చెప్పొచ్చు. కోదండరాం నిలబడతారు కానీ ఎవరూ బరిలో ఉండరు. ప్రచారంలో ఏ పార్టీ జోక్యం చేసుకోకపోతే… సులువు అవుతుంది. కానీ కేసీఆర్ కోవర్టు పార్టీలు ఉన్నాయని చాలా మంది అనుమానం. అందుకే సాధ్యం కాదన్న వాదన కూడా అంతే బలంగా వినిపిస్తోంది.