తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ పెట్టి, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పార్టీని బరిలోకి దింపారు ప్రొఫెసర్ కె. కోదండరామ్. అయితే, ఆయన పెట్టిన పార్టీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు అంటూ ఎక్కడా రాలేదు. పోనీ, ఆయనైనా స్వయంగా ఎన్నికల్లో పాల్గొన్నారా అంటే అదీ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆయనకి జనగామన స్థానాన్ని కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయినాసరే ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చెయ్యలేదు. అప్పటితో ఆ చర్చ ముగిసింది. అయితే, కోదండరామ్ చట్టసభలకు వెళ్తే బాగుంటుందనే అభిప్రాయం ఆయన అనుచరుల్లో చాలామందికి ఉంది. ఇప్పుడు దానికి మార్గం సుగమం అయ్యే అవకాశాలున్నట్టుగా చర్చ జరుగుతోంది.
ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, శాసన మండలికి వెళ్లాలని కోదండరామ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గానికి వచ్చే ఏడాది ఎన్నికలు ఉంటాయి. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నిక జరుగుతుంది. అయితే, ప్రస్తుతం ఈ స్థానం నుంచి తెరాస తరఫున పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ సీటు నుంచే బరిలోకి దిగాలనే ఆలోచనలో కోదండరామ్ ఉన్నారని తెలుస్తోంది. ఇప్పట్నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రయత్నాలు మొదలుపెట్టాలని సిద్ధమౌతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ తోపాటు వామపక్షాల మద్దతును కూడా ఆయన ఈ సందర్భంగా కోరడానికి సిద్ధమౌతున్నారని సమాచారం.
ఎమ్మెల్సీగా బరిలోకి దిగితే కోదండరామ్ కి ఉండాల్సిన సానుకూలతలు కొన్ని ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్లలో ఎక్కువమంది ఒకప్పుడు కోదండరామ్ శిష్యులే కావడం విశేషం. కాబట్టి, ఆయన బరిలోకి దిగితే అందరూ ఆదరిస్తారనేది కోదండరామ్ నమ్మకం. ఈ ప్రయత్నంలో భాగంగా మూడు జిల్లాలకు చెందిన విద్యార్థుల వివరాలను ఆయన సేకరిస్తున్నారనీ, త్వరలో ఒక్కొక్కరిగా అందరికీ టచ్ లోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దీంతోపాటు, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమంతోపాటు, పాత ఓటర్లను కూడా కలుసుకునేందుకు ఆయా జిల్లాల్లో తరచూ పర్యటనలు ప్రారంభించాలని భావిస్తున్నారట. అంచనా అయితే బాగానే ఉందిగానీ, సరిగ్గా ఎన్నికలు వచ్చే సమాయానికి ఆయన ఆశిస్తున్నట్టు ఇతర పార్టీల మద్దతు వస్తుందా అనేది ప్రశ్నగా కనిపిస్తోంది. ఏదేమైనా, ఎమ్మెల్సీ స్థానం కోసం ఇప్పట్నుంచే ముందుచూపుతో వ్యవహరించేందుకు కోదండరామ్ సిద్ధమౌతుండటం విశేషమే.