తెలుగుదేశంలోకి ఫిరాయించిన 13 మంది వైసీపీ శాసనసభ్యులను అనర్హులను చేయాలంటూ దాఖలైన పిటిషన్లు సక్రమంగా లేవంటూ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించడం సుప్రీం కోర్టు జోక్యానికి ద్వారాలు తీసింది.స్పీకర్ తగు చర్యలు తీసుకోవడంలేదంటూ వైసీపీ ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ కేసు జులై 8న విచారణకు రానున్నట్టు సమాచారం. విచారణకు సందర్భంలో స్పీకర్ ఇంతకాలం ఎందుకు చర్య తీసుకోలేదనే చర్చ ముందుకు వస్తుంది. ఫలానా గడువులోగా తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించవచ్చు. లేదా రాజ్యాంగ సంబంధమైన అసాధారణ వ్యాఖ్యలు కూడా చేయొచ్చు. అందుకు అవకాశం లేకుండా చేసేందుకే కోడెల హడావుడిగా నిర్ణయం ప్రకటించారని వైసీపీ విమర్శించింది. కాని మరో విధంగా చూస్తే ఈ చర్యతో ఆయనే కోర్టుజోక్యానికి అవకాశం కల్పించినట్టయింది. సాధారణంగా కోర్టులు స్పీకర్లకు ఆదేశాలివ్వవు. అయితే ఒకసారి స్పీకర్ నిర్ణయం ప్రకటిస్తే అది పదవ షెడ్యూలు స్పూర్తికి అనుగుణంగా వుందా లేదా అని పరిశీలించేందుకు సిద్ధంమవుతాయి. ఆ విధంగా చూస్తే తెలుగుదేశం లేదా స్పీకర్ కోరుకున్నదానికి భిన్నమైన ఫలితం రావచ్చు. ఫిరాయింపులు తప్పేనని భావించేట్టయితే ఒకవేళ వైసీపీ వారి పిటిషన్లు సక్రమంగా లేవనుకున్నా ఫిరాయింపులపై తానుగా స్పందించవలసిన బాధ్యత అనుభవజ్ఞుడైన స్పీకర్ కోడెలకు వుంటుంది. పాలకపక్షం నుంచి ఎవరైనా ఫిరాయించి ప్రభుత్వ మనుగడకే ముప్పు ఇస్తే ఆఘమేఘాల మీద స్పందించివుండేవారని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆలస్యంగా ప్రకటించిన తిరస్కరణ రెండవ పొరబాటు కావచ్చు. ఎందుకంటే రాజ్యాంగ మౌలిక స్పూర్తి సమస్య వస్తే కోర్టులు నిక్షేపంగా జోక్యం చేసుకుంటాయి. కేశవానంద భారతి కేసు తర్వాత సుప్రీంకోర్టు ఆ విధమైన అధికారం తనకు తనే ప్రకటించుకుంది.కనుక కోడెల ఆలస్యంగా తీసుకున్న తొండరపాటు చర్య కోర్టు జోక్యానికి తలుపులు తెరిచిందంటే తప్పులేదు. మరి ఆ న్యాయమూర్తులు ఏం చేస్తారో చూడాల్సిందే!