ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావు ఇటీవల ఒక టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2014 ఎన్నికలలో తాను రూ.11.5 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పడంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైకాపా నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి భన్వర్ లాల్ కి ఒక వినతిపత్రం ఇచ్చారు. అంతకు ముందు ఒకసారి ఆయనపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు కానీ అది వీగిపోయింది. ఆ తరువాత 13 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరడంతో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మళ్ళీ ఆయనకే వినతిపత్రం సమర్పించవలసి వచ్చింది. తనకే షాక్ ఇవ్వాలని చూసిన వైకాపాకి ఈరోజు ఆయన షాక్ ఇచ్చారు. వారి వినతి పత్రంలో కొన్ని లోపాలున్నాయని, రాజ్యంగబద్దంగా కూడా లేదని చెపుతూ దానిని తిరస్కరించారు. ఆయన తమ విజ్ఞప్తిని మన్నించి ఆ 13 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారని వైకాపా కూడా ఆశపడటం లేదు. కనుక ఎదురు చూడటం లేదు కూడా. కాకపోతే ఆయనకి లేఖ ఇస్తే ఆయన ఎలాగూ దానిపై ఏ నిర్ణయం తీసుకోరు కనుక ఆయనని, ఆ సాకుతో ప్రభుత్వాన్ని నిందించడానికి వీలవుతుందనే ఆలోచనతోనే వైకాపా అది ఇచ్చి ఉండవచ్చు. కనుక వారి విజ్ఞప్తిపై ఆయన ఏ నిర్ణయం తీసుకోకుండా త్రొక్కిపట్టి ఉంచినా నష్టం ఏమీ లేదు. కానీ ఆయన ఈరోజు వారి వినతి పత్రాన్ని తిరస్కరించడంతో మళ్ళీ వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి, స్పీకర్ పక్షపాతం గురించి వైకాపా నేతలు విమర్శలు గుప్పించే అవసరం, అవకాశం కల్పించినట్లయిందని భావించవచ్చు.