ఒక్కోసారి రాజకీయ నాయకులు నోరుజారి చేజేతులా అనవసరమైన వివాదాలలో చిక్కుకొంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావు కూడా అలాగే నోరుజారి చిక్కుల్లో పడ్డారిప్పుడు. క్రిందటి నెల 16వ తేదీన ఎన్.టీవి న్యూస్ ఛానల్ నిర్వహించిన ‘ఫేస్ టు ఫేస్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎన్నికలలో డబ్బు ప్రభావం గురించి అడిగిన ఒక ప్రశ్నకి ఆయన సమాధానం చెపుతూ, “1983 ఎన్నికల సమయంలో నేను కేవలం రూ.30,000 ఖర్చు చేస్తే, 2014 ఎన్నికలలో రూ.11.5 కోట్లు ఖర్చు చేయవలసి వచ్చింది. రాన్రాను ఎన్నికలు చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోతున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం,” అని చెప్పారు.
కోడెల శివప్రసాదరావు పొరపాటున నోరు జారి ఆ విషయం బయట పెట్టుకోవడంతో వైకాపా ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, రోజా తదితరులు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ని కలిసి ఆయనపై పిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించి రూ.11.5 కోట్లు ఖర్చు చేసి ఎన్నికలలో గెలిచానని చెప్పుకొన్న స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అనర్హత వేటు వేయాలని వారు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
వారి పిర్యాదుని స్వీకరించిన ఎన్నకల సంఘం అధికారి భన్వర్ లాల్, ఎన్.టీవి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ఒక లేఖ వ్రాశారు. కోడెల శివప్రసాదరావు ఇంటర్వ్యూ తాలూకు వీడియో క్లిప్పింగ్ ని తమకి అందించవలసిందిగా ఆదేశించారు. ఆ ఆదేశాలని ఎన్.టీవి న్యూస్ ఛానల్ తిరస్కరించలేదు కనుక ఆ వీడియో క్లిప్పింగుని ఎన్నికల సంఘానికి సమర్పించక తప్పదు. దాని ఆధారంగా ఎన్నికల సంఘం కోడెలపై చర్యలు తీసుకొంటే ఆయనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు. ఒకవేళ వైకాపా పిర్యాదుపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోనట్లయితే, వైకాపా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. కనుక ఈ సమస్యని అంతవరకు రాకుండా తెదేపా ప్రభుత్వం ఏవిధంగా అడ్డుకొంటుందో చూడాలి.