తనపై కేసు పెట్టినందుకు తానేం బాధపడటం లేదన్నారు టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… చట్టప్రకారం ఫిర్యాదు చేస్తే ఎఫ్.ఐ.ఆర్. రిజిస్టర్ చేస్తారన్నారు. ఈ విషయంలో నిజాలు కచ్చితంగా బయటకి రావాలని, వచ్చి తీరతాయన్నారు. పోలింగ్ బూతులో జరిగిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను బయటకి తీయాలని కోడెల డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో ఎలాంటి రౌడీయిజాలు లేకుండా తన నియోజక వర్గంలో చేశానన్నారు. పేకాట క్లబ్బుల దగ్గర్నుంచీ అన్నింటినీ ప్రక్షాళణ చేశాననీ, అది తాను కోరుకుంటున్న సమాజం అన్నారు. తనకు తగిలిన గాయాన్ని ఓర్చుకోవడానికి కారణం, వాస్తవాలను చట్టప్రకారం బయటపడాలనే అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీళ్లు (వైకాపా) దుర్మార్గాలు చేశారనీ, బూత్ క్యాప్చరింగ్ కి ప్రయత్నించారని కోడెల ఆరోపించారు. అధికారం కోరుకునేవారు ఇలాంటి పనులు చెయ్యకూడదన్నారు. జగన్ దగ్గర ఉన్నవాళ్లలో చాలామంది గత్యంతరం లేక ఉన్నారనీ, ఆయన యాటిట్యూడ్ భరిస్తున్నది టీడీపీలో ఖాళీలు లేకనే అన్నారు. అధికారంలోకి వస్తారని కలలు కనొద్దనీ, నీ జీవిత కాలంలో ముఖ్యమంత్రి కాలేవని జగన్ ఉద్దేశించి కోడెల వ్యాఖ్యానించారు.
మొత్తం ఎన్నికల ప్రచారంలో అంబటి రాంబాబు అనే పేరును తాను ఎక్కడా చెప్పలేదన్నారు కోడెల. ఎందుకంటే, తనకు ఆయన పోటీ కాదన్నారు. ఐదేళ్ల తరువాత ఆయనొచ్చాడనీ, తాము నిరంతరం ప్రజలతో ఉంటున్నామనీ, వీళ్లు అనుకుంటున్నట్టు జనాలు అంత పిచ్చివాళ్లు కాదన్నారు. ఎన్నికలు రాగానే కులాలు, మతాలు, డబ్బులు, గొడవలు అడ్డం పెట్టుకుని గెలుద్దామని ప్రయత్నించారన్నారు. ఈ తీరుపై ప్రజల నుంచి తీవ్ర ఖండన ఉంటుంది. అది ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుందని కోడెల చెప్పారు. ఎలాగూ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి, గొడవలు చేస్తే టీడీపీ వాళ్లు భయపడతారనీ తాము రెచ్చిపోవచ్చని అంబటి రాంబాబుతోపాటు కొంతమంది చేసిన కుట్ర ప్రయత్నం ఇది అన్నారు.
ఎన్నికల సంఘం కార్యాలయంలో విజయసాయి రెడ్డి అక్కడే తిష్టవేసుకుని ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు? రాష్ట్రంలో ఎవరు బదిలీ కాబోతున్నారో ముందుగానే ఆయన చెప్తున్నాడంటే… ఆయన ఈసీ ఏజెంటా అని విమర్శించారు. అవినీతి కేసుల్లో ఎ-2 గా ఉన్న ఆయనతో మాట్లాడతారుగానీ, ఈవీఎంలలో సాంకేతికంగా లోపాలున్నాయని నిరూపించేందుకు వచ్చే నిపుణులతో మాట్లాడరన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను నాశనం చేసిపెట్టారన్నారు. ఈ సందర్భంగా, ప్రధాన మోడీపైనా, తెలంగాణ సీఎం కేసీఆర్ మీద కూడా కోడెల విమర్శలు చేశారు. వైకాపా నేతలు గవర్నర్ ను కలిసిన వెంటనే కోడెలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన డిమాండ్ చేస్తున్నట్టు వీడియో ఫుటేజ్ ని బయటపెడతారో లేదో చూడాలి.