ఎప్పుడో జరిగిపోయిన ఇష్యూ అది..! జనం కూడా దాదాపు మరచిపోయిన ఘటన అది. జాతీయ మీడియా కూడా ఈ చర్చను పక్కన పెట్టేసింది. కానీ, తెలుగుదేశం పార్టీ మాత్రం కావాలనే గతాన్ని తవ్వి తలకెత్తే ప్రయత్నం చేస్తోంది! అలాగని తమ తలకెత్తుకోవడం కాదు.. ప్రతిపక్షం నెత్తిపై పడేసే ప్రయత్నం చేస్తోంది..! ఇంతకీ ఆ ఇష్యూ ఏంటంటే… మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యల గురించి! ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరచేలా ఉన్నాయంటూ ప్రతిపక్ష నేత జగన్ కు చెందిన మీడియా సంస్థలో కథనాలు వచ్చాయి. ఆ తరువాత, జాతీయ మీడియా కూడా ఇదే అంశాన్ని కొన్ని రోజులపాటు హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వివాదం ముగిసి చాలా రోజులైంది. కానీ, కావాలనే ఈ అంశాన్ని శాసనసభలో చర్చకు తీసుకొచ్చింది అధికార పార్టీ.
స్పీకర్ స్థానాన్ని కించపరచే విధంగా కోడెల వ్యాఖ్యల్ని వక్రీకరించిన జగన్ మీడియాపై సభ చర్యలు తీసుకోవాలంటూ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపై స్పందించి, స్పీకర్ ను అగౌరవ పరచడం అంటే, రాష్ట్రంలోని అత్యున్నత చట్టసభ సభ్యులను కించపరచినట్టుగానే భావించాలన్నారు. అయితే, ఉన్నట్టుండి ఈ చర్చ ఎందుకు తెరమీదికి వచ్చినట్టు..? మరే ఇతర అంశాలు లేవన్నట్టుగా జనం మరచిపోయిన కోడెల వ్యాఖ్యల్ని సభలో ఎందుకు డిస్ ప్లే చేసినట్టు..? ప్రతిపక్షాలకు కూడా ఈ పాత వీడియోలను చూపించాలని ఎందుకు అనుకుంటున్నట్టు..? దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా.. అంటే, ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమైంది. సరిగ్గా ఇదే సమయం చూసుకుని కావాలనే పాత ఇష్యూని తెలుగుదేశం తెర మీదికి తెచ్చిందని అనిపిస్తోంది. పనిలోపనిగా సాక్షి మీడియాపై ఎప్పటి నుంచో అధికార పార్టీ కన్ను ఉందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో… ఈ నేపథ్యంలో సాక్షి మీడియాని కార్నర్ చేయడమే టీడీపీ లక్ష్యం కావొచ్చు. అయితే, ఒకవేళ కోడెల విషయంలో జగన్ మీడియా కథనం వక్రీకరణే అనుకున్నా… దానిపై చర్యలు తీసుకునే అధికారం సభకు ఉంటుందా అనేది ప్రధానమైన చర్చ. సభ బయట కూడా స్పీకర్ అధికారాలు వర్తిస్తాయా అనేది కూడా ఆలోచించాలి!
ఏదెలా ఉన్నా… జగన్ మీడియాపై ఏదో ఒక రకంగా చర్యలకు దిగేందుకు ఈ ఇష్యూను ఒక అస్త్రంగా మార్చుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. లేదంటే, ఇంత పాత ఇష్యూని తెరమీదికి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది..? అది సరే.. ఈ క్రమంలో కోడెల పరువు కూడా మరోసారి పోయే అవకాశం ఉంది కదా. దాన్ని పణంగా పెట్టైనా సరే, జగన్ మీడియాపై ఏదో ఒకలా చర్యలకు దిగాలన్నదే తెలుగుదేశం పార్టీ వ్యూహమా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.