ముద్దుబిడ్డ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు కు పల్నాడు కన్నీటి వీడ్కోలు పలికింది. వైద్యునిగా ప్రజల కోసం స్టెత్ పట్టి.. పీడిత ప్రజల కోసం రాజకీయ నేతగా చేత్తో కర్ర పట్టిన కోడెల జ్ఞాపకంగా మగిలిపోయారు. కోడెలను కడసారి చూసేందుకు పల్నాడు ప్రజలు పోటెత్తారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా కోడెలకు నివాళి అర్పించారు. క్యాన్సర్ ఆసుపత్రి ఫౌండర్ ట్రస్టీగా ఉన్న కోడెలకు బాలకృష్ణతో మంచి స్నేహం ఉంది. బాలకృష్ణ.. కోడెల పార్ధివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురై..కన్నీరు పెట్టుకున్నారు. అంతిమయాత్ర అసాంతం… బాలకృష్ణ విషణ్ణవదనంతో కనిపించారు.
కోడెల నివాసం నుంచి గుంటూరు రోడ్ లో ఉన్న స్వర్గపురికి ఒక కిలోమీటరే ఉన్నప్పటికీ మధ్యలో వైసీపీ నేతల నివాసాలు ఉండటంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో పోలీసులు వేరే మార్గం నుంచి కోడెల అంతిమ యాత్రను మళ్లించారు. కోడెల అంతిమ యాత్ర ఆయన నివాసంలో ప్రారంభమైన సమయం నుంచి స్వర్గపురికి చేరుకునే వరకు వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. జనసందోహం అంతిమ యాత్రలో పాల్గొని పెద్ద ఎత్తున జోహార్లు అర్పించారు. రోడ్డు పొడవునా కోడెల పార్ధివదేహానికి నరసారావుపేట ప్రజానీకం తుదివీడ్కోలు పలికింది. రోడ్డుకిరువైపులా, భవనాలు, మిద్దెలపై ఉండి ప్రజానీకం కోడెల అంతిమయాత్రను సందర్శించి నివాళులర్పించారు. అనేక మంది భవనాల పై నుంచే కోడెల పార్ధివదేహానికి నమస్కరించారు.
స్వర్గపురిలో కోడెల మృతదేహానికి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలను ఆయన కుమారుడు డాక్టర్ కోడెల శివరాం నిర్వహించారు. అంతకుముందు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ నేతలు కోడెల పార్ధివదేహంపై గంధపు చెక్కలు ఉంచారు. కోడెల చితి మంటలు ఎగిసిపడుతున్న సమయంలో కూడా స్వర్గపురిలోకి ప్రజానీకం భారీగా చేరుకుని ఆయన చితి వద్దకెళ్లి నివాళులర్పించారు. సాయంత్రం ఐదున్నర సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో ధ్రువతారగా వెలుగొందిన కోడెల పార్ధివదేహం అనంతవాయువుల్లో కలిసిపోయింది. పల్నాడు.. జోహార్ కోడెల అని.. తుది వీడ్కోలు పలికింది.