ఎంతోమంది మేధావులు తలలు బద్దలుకొట్టేసుకుంటున్నారు..! ఎన్నో సంస్థలు తర్జనభర్జనలు అయిపోతున్నాయి..! తరతరాలుగా మన సమాజంలో జాఢ్యంగా మిలిపోయిన సమస్య అది. చరిత్రలో ఎంతోమంది సంఘ సంస్కర్తలకు కూడా ఆ సమస్యకు సరైన పరిష్కార మార్గం తట్టలేదని చెప్పాల్సిన తరుణమిది. కానీ, ఇంత జఠిలమైన సమస్యకు ఈజీగా పరిష్కారం చూపించారు.. శ్రీమాన్ కోడెల శివప్రసాదరావు. మహిళలపై వేధింపులు తగ్గించడం ఇంత ఈజీనా… ఈ ఆలోచన గతంలో ఎవ్వరికీ తట్టలేంటబ్బా అని ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు!!
మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, వేధింపులు, అక్రమ రవాణాలకు సింగిల్ టేక్‌లో పరిష్కార మార్గాన్ని చూపించేశారు ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. ‘ఒక వాహనం కొని షెడ్డులో ఉంచితే ఏ ప్రమాదమూ ఉండదు. దాన్ని రోడ్డు మీదికి తీసుకెళ్తేనే ఇబ్బంది. మహిళల పరిస్థితి కూడా ఇలాంటిదే. వారు వంటింటికి మాత్రమే పరిమితం అయితే ఎలాంటి సమస్యలూ ఉండవు. ఎటువంటి వేధింపులూ ఉండవు. ఉద్యోగ, వ్యాపారాల పేరుతో మహిళలు బయట తిరుగుతూ ఉండటం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఈ పనులు చేయకూడదని నా ఉద్దేశం కాదు. వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలన్నది తన ఆకాంక్ష’ అని సెలవిచ్చారు.
ఒక్క సలహాతో ఓపెద్ద సమస్యకు ఎంత ఈజీగా పరిష్కారం చూపించేశారండీ..! ఈ మాత్రం ఆలోచన తట్టక, అనవసరంగా మహిళా రక్షణల కోసం కొత్త కొత్త చట్టాలు చేసేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు రకరకరాల పోరాటాలు చేసేస్తున్నాయి..! మహిళా సంఘాలు రకరకాల ప్రతిపాదనల్ని తెరమీదికి తెస్తున్నాయి. స్పీకర్ గారు ఇచ్చిన ఈ ఒక్క సలహా పాటిస్తే చాలదూ..! మహిళల్ని గడపదాటి రాకుండా చేస్తే ఏ సమస్యా ఉండదుగా… ఈ ఐడియా గతంలో ఎవ్వరికీ ఎందుకు రాలేదంటారూ..? ఆయన అంతర్యం, అంతరగం అంతా ఇదేనండీ.
మనం ఎక్కడున్నాం..? ఏ కాలంలో బతుకుతున్నాం..? నాయకులుగా ఏ తరహా పురోగతి కోసం ప్రయత్నిస్తున్నాం..? ముందు తరాలకు మనం చూపించబోతున్న మార్గాలు ఇవేనా..? అందించబోతున్న ఆదర్శాలు ఇవేనా..? అన్ని రంగాల్లోనూ మహిళలు అద్భుత విజయాలు సాధిస్తుంటే… మన ఆలోచనలు ఇంకా పాత షెడ్డుల్లోనే ఉంటే ఎలా..? కోడెలవారు ఈ స్థాయిలో ప్రవచిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. పైగా హైటెక్ ప్రభుత్వంలో ఉన్నవారాయె! ఇదే విషయమై తాను చేసిన వ్యాఖ్యల అంతరార్థాన్ని మరోసారి విడమరచి చెప్పే ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది సుమీ..!