మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యారు. నిన్న రాత్రి సమయంలో.. హఠాత్తుగా ఆయన ఒళ్లంతా చెమటలు పట్టి.. శ్వాస పీల్చుకోవడం.. కష్టంగా మారడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు వచ్చిందని గుర్తించి చికిత్స ప్రారంభించారు. ప్రాణానికి ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత.. అత్యంత ఎక్కువగా … వేధింపులు ఎదుర్కొంటోన్నది ఆయనే. గత రెండున్నర నెలల కాలంలో.. ఆయనపై.. ఆయన కుటుంబంపై… పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టారో.. ఎవరెవరు వచ్చి కేసులు పెడతారో.. ఎవరికీ లెక్కలేదు. చివరికి అసెంబ్లీ ఫర్నీచర్‌ను ఆయన తీసుకెళ్లిపోయారంటూ.. కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అదే సమయంలో.. ప్రభుత్వం వైపు నుంచి ఆయన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. ఆయన కుమారుడు నిర్వహిస్తున్న హీరోహోండా షోరూమ్‌లో.. టీఆర్ నెంబర్లు లేకుండా బైక్‌లు విక్రయించారంటూ.. కేసు నమోదు చేశారు. షోరూంను సీజ్ చేశారు. అలాంటి… బైక్‌లను టీఆర్ నెంబర్లు.. రిజిస్ట్రేషన్లు లేకుండా అమ్మడం ఎలా సాధ్యమో.. రవావాణా రంగంలో ఉన్న వారెవరూ ఊహించలేరు. దీనికి సంబంధించి.. హైకోర్టులో ఆధారాలు చూపించలేకపోయారు ఆర్టీఏ అధికారులు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కోడెల శివప్రసాదరావును టార్గెట్ గా పెట్టుకుని ప్రభుత్వం.. కొంత మందిని ప్రత్యేకంగా.. ఓ గ్రూప్‌గా ఏర్పాటు చేసిందని.. చెబుతున్నారు. ఆయనను ఎలా.. టార్గెట్ చేయాలో.. రోజు వారికీ దిశానిర్దేశం జరుగుతుందని.. అంటున్నారు. వారు చెప్పినట్లుగానే… రోజూ.. కోడెల కుటుంబంపై.. ఏదో విధమైన.. చర్య ప్రభుత్వంపై కనిపిస్తోంది. మీడియా కూడా.. దుష్ప్రచారం చేస్తోందన్న బాధ కోడెలలో ఉందంటున్నారు.
కోడెల … ఫ్యాక్షన్ తరహా రాజకీయాలను ఎదుర్కొని నిలబడిన నేత. పల్నాడులో ఒకప్పుడు.. కాంగ్రెస్ మినహా.. ఏ నేత కూడా… బతికి బట్టకట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు.. టీడీపీ తరపున రంగంలోకి దిగి… దాడుల రాజకీయాలను.. ధీటుగా ఎదుర్కొన్నారు. తిరుగులేని నేతగా ఎన్నికయ్యారు. వైఎస్ హయాంలో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా.. ఆయనకు పట్టున్న గ్రామాలన్నీ.. వేరే నియోజకవర్గాల్లో చేరడంతో.. రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు.. వేధింపుల కారణంగా.. ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది.