విశాఖ విమానాశ్రయంలో.. కోడికత్తితో జగన్ పై జరిగిన దాడి కేసును.. హైకోర్టు ఎన్ఐఏకి ఇచ్చిందంటూ.. విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదు. ఆరు రోజుల కిందటే… కేంద్ర హోంమంత్రిత్వశాఖ… ఎన్ఐఏను.. ఈ కేసు విచారణకు పురమాయించింది. వాళ్లు కేసు నమోదు చేసుకుని.. ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేసుకున్నారు. ఆ విషయాలనే హైకోర్టుకు తెలిపారు. దాంతో హైకోర్టు ఇక తాము ప్రత్యేకంగా ఆదేశాలిచ్చేదేముంది.. కేంద్రమే.. ఆదేశించింది కదా.. అని చెప్పింది. ఆ రకంగా.. ఎన్ఐఏ విచారణకు ప్రత్యేకంగా హైకోర్టు ఆదేశాలివ్వకపోయినా.. కోర్టు కూడా అనుమతించిందన్న అర్థాన్ని తీసుకు రాగలిగారు. ఇదే.. ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. శాంతిభద్రతల అంశం.. రాష్ట్రాల పరిధిలోనిది. కేంద్రం జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం. అయితే… జాతీయ భద్రతతో ముడిపడిన ఉన్న కేసుల విషయంలో జోక్యం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదని.. ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. రాష్ట్రాల హక్కులను హరించేందుకు కారణాలను వెదుక్కుని మరీ.. కేంద్రం వేలు పెడుతోందని.. దానికి కోడి కత్తి కేసే ఉదాహరణ అని ఏపీ ప్రభుత్వ వర్గాలు మండి పడుతున్నాయి.
నిజానికి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఏపీ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ.. ఇలా ఇస్తే.. అది ఏపీ లా అండ్ ఆర్డర్ లో… జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి తమంతట తాము అవకాశం ఇచ్చినట్లు అవుతుందని.. అది ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్లో విపరీత పరిణామాలకు కారణం అవుతుందనే ఆలోచన చేసింది. అదే కోర్టు ఆదేశిస్తే.. ఏ సమస్యా ఉండదని అనుకుంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేయించాలంటూ.. జగన్ వేసిన పిటిషన్ పై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే.. ఆ ప్రకారం.. ముందడుగు వేయాలనుకున్నారు. కానీ అనూహ్యంగా.. హైకోర్టు నిర్ణయం తీసుకోక ముందే… ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అది ఏపీ ప్రభుత్వానికి తెలియజేయలేదు. నేరుగా హైకోర్టులో న్యాయమూర్తికి తెలిపారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరిగిందని.. ఏపీ భావిస్తోంది.
ఎన్ఐఏ అధికారులు సొంతంగా విచారణ చేపట్టలేరు. వారు.. విశాఖ పోలీసుల నుంచి.. విచారణ వివరాలు తీసుకోవాల్సిందే. అందుకే… ఎన్ఐఏ అధికారులు.. విశాఖ సిట్ అధికారుల్ని సంప్రదించారు. కానీ… విశాఖ సిట్ అధికారులు మాత్రం.. ఏపీ ప్రభుత్వ అనుమతి లేకుండా.. వివరాలను ఇవ్వలేమని స్పష్టం చేశారు. కోడికత్తి కేసుపై కేంద్ర నిర్ణయం రాష్ట్రాధికారాల్లో జోక్యం చేసుకోవడం కిందికే వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అసమ్మతిని కేంద్రానికి తెలిపేలా లేఖ రాయాలని యోచిస్తోంది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా.. అన్న అంశంపై మత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటూ ఇటు తిరిగి కోడికక్తి కేసు.. కేంద్రం, ఏపీ మధ్య మరో సారి పంచాయతీ తేవడం ఖాయంగా కనిపిస్తోంది.