జగన్ పై జరిగిన కోడికత్తి కేసు ఘటన అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. శ్రీనివాసరావును ఏడు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ .. పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించింది. హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో శ్రీనివాసరావును విచారించనున్నారు. లాయర్ సమక్షంలో విచారించాలని కోర్టు చెప్పినప్పటికీ.. శ్రీనివాసరావు లాయర్ కు సమాచారం ఇవ్వలేదు. నిందితుడు శ్రీనివాసరావును ఎక్కడకు తీసుకువెళ్లారో సమాచారం ఇవ్వాలని…విజయవాడ సెషన్స్ కోర్టులో న్యాయవాది సలీం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ విచారణకు స్వీకరించింది. నిందితుడి తరపు న్యాయవాదులకు సమాచారం ఇవ్వాలని ఎన్ఐఏకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని కోర్టు మరో సారి ఆదేశాలు జారీ చేసింది.
మరో వైపు ఈ కేసు ఎన్ఐఏ విచారణ.. సమాఖ్య స్ఫూర్తిపై కత్తి కట్టడమేనని.. చంద్రబాబు మండిపడ్డారు. ఈ మేరకు ప్రధానమంత్రికి లేఖ రాశారు.
విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధ్యక్షుడు జగన్ పై దాడి కేసులో..రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్.ఐ.ఎ.కు అప్పగించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించిన కేసును ఎన్.ఐ.ఎ కి అప్పగించడం ఏమిటని లేఖలో చంద్రబాబు నిలదీశారు. ఎన్.ఐ.ఎ దర్యాప్తుకు కొన్ని ప్రత్యేక కేసులను మాత్రమే అప్పగించాలని 2008లో ఎన్.ఐ.ఎ ఆమోదించిన చట్టంలో ఉందని మోదీకి రాసిన లేఖలో చంద్రబాబు గుర్తుచేశారు. నకిలీ నోట్లు, సరిహద్దుల్లో టెర్రరిస్టు కార్యకలాపాలు, దేశ అంతర్గత వ్యవహారాలకు ముప్పు కలిగించే తీవ్రవాద కార్యకలాపాలపైనే ఎన్.ఐ.ఎ దర్యాప్తు నిర్వహించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్న విషయాన్ని సీయం వెల్లడించారు. గుజరాత్ లో జరిగిన పోలీసు బాసుల సమావేశంలో..2009లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
2011 జూన్ లో లక్నోలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో..రాజ్యాంగ సవరణ లేకుండా ఎన్.ఐ.ఎ చట్టాన్ని తీసుకురావడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమని, శాంతి భద్రతలను పరిరక్షించడంలో రాష్ట్రాల పాత్రను తగ్గించడమేనని ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయాన్ని కూడా చంద్రబాబు తన లేఖలో ప్రధాని మోదీకి గుర్తుచేశారు. ప్రస్తుతం కోడికత్తి కేసులో కేంద్రం తీసుకున్న నిర్ణయం..కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు విఘాతం కలిగించే విధంగా ఉందని, రాష్ట్రాల పాలనా వ్యవస్థను దెబ్బతీసే విధంగా మారిందని సియం లేఖలో వివరించారు. కోడికత్తి కేసును ఎన్.ఐ.ఎ కు అప్పగిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఎన్.ఐ.ఎ..ఎఫ్.ఐ.ఆర్ బుక్ చేయడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీలో ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను నక్సలైట్లు హతమార్చిన కేసులో..ఎన్.ఐ.ఎ ఎందుకు దర్యాప్తుకు స్వీకరించలేదని చంద్రబాబు లేఖలో ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఒక సాధారణ కేసును దర్యాప్తుకు స్వీకరించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ..వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.