కోడికత్తి శీను తల్లిదండ్రులకు వేదన తప్పడం లేదు. ఐదేళ్లు అయినా ఆయనకు బెయిల్ లభించలేదు. మామూలుగా ఎలాంటి కేసులో అయినా 180 రోజుల తర్వాత బెయిల్ లభించాల్సి ఉంటుంది. కానీ తనపై జరిగిన దాడిని కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని అప్పట్లో బీజేపీ సర్కార్ లో మంచి పట్టు ఉన్న జగన్ రెడ్డి లాబీయింగ్ చేసి.. ఎన్ఐఏ దర్యాప్తు వేయించుకున్నారు. సీబీఐ విచారణ చేయాలంటే కోర్టు ఆదేశాలుండాలి. కానీ ముందుగానే ఎన్ఐఏ విచారణకు ఆదేశాలు తెచ్చుకోవడంతో కోర్టు కూడా అంగీకరించింది.
ఎన్ఐఏ కేసులు చాలా తీవ్రమైనవి. బెయిళ్లు అంత తేలికగా రావు. ఓ సారి బెయిల్ ఇస్తే.. ఎన్ఐఏ రద్దు చేయించింది. అప్పట్నుంచి జైల్లోనే ఉన్నారు. ఐదేళ్ల జీవితం మగ్గిపోయింది. ఎన్ఐఏ దర్యాప్తు తాము అనుకున్నట్లుగా రాలేదని జగన్ రెడ్డి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి విచారణ ఆలస్యం చేస్తున్నారు. కానీ ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావడం లేదు. దీంతో జైలులోనే మగ్గిపోతున్నాడు కోడికత్తి శీను.
తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన విశాఖ ఎన్ఐఏ కోర్టు.. బెయిల్ ఇచ్చేందుకు తమ అధికారం లేదని స్పష్టం చేసింది. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఇంతకు ముందు రెండు సార్లు సీజేఐలకు కోడికత్తి శీను తల్లి లేఖలు రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు హైకోర్టులో ప్రయత్నించాల్సి ఉంది.