జగన్ పై కోడి కత్తి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఐదేళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్న జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను విశాఖ జైల్లో నిరాహారదీక్షకు దిగారు. శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో శ్రీనివాస్ తల్లి, సోదరుడు ఆమరణ దీక్ష చేయనున్నారు.
దాడి కేసులో తనకు బెయిల్ బెయిల్ ఇవ్వాలని లేదా సీఎం జగన్ వాంగ్మూలం ఇవ్వాలనే డిమాండ్‌తో వీరు దీక్షలు ప్రారంభించారు.
కేసును జగన్ రెడ్డి ఎన్ఐఏకి వెళ్లేలా చేశారు. కానీ ఆయన మాత్రం కనీసం వాంగ్మూలం కూడా ఇవ్వడం లేదు. ఎన్ఐఏ విచారణ పూర్తి చేస్తే మరింత లోతుగా దర్యాప్తు జరగాలని పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తే.. ట్రయల్ జరగకుండా స్టే తెచ్చుకున్నారు. అదే సమయంలో జగన్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినా.. ఎన్వోసీ ఇచ్చినా నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ వస్తుంది. కానీ జగన్ రెడ్డి మాత్రం దానికి అంగీకరించడం లేదు.
జనపల్లి శ్రీనివాసరావు నిఖార్సైన జగన్ అభిమాని. ఆయన జగన్ రెడ్డికి ఫ్లెక్సీలు కూడా వేసేవాడు. ఎన్ఐఏ కూడా దర్యాప్తులో తేల్చింది. ఆయన వెనుక ఏ పార్టీ లేదని తెలిపింది. అయినా తాను అనుకున్నట్లుగా దర్యాప్తు ఉండాలని తన రాజకీయ ప్రత్యర్థుల పేర్లు ఉండాలని అలా ఉంటేనే కరెక్ట్ గా విచారణ జరిపినట్లు అని జగన్ రెడ్డి ఫీలవుతున్నారు.
జగన్ రెడ్డి ఏ కేసులోనూ ట్రయల్ వరకూ రాకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. అక్రమాస్తుల కేసులోనూ అంతే. ఇక్కడ కోడికత్తి కేసులోనూ అంతే. కనీసం బాధితుడుగా ఉన్నా.. తన బాధను చెప్పుకునేందుకు ఆయన కోర్టుకు వెళ్లడం లేదు. నిజంగా శిక్ష పడినా కోడికత్తి శీనుకు ఐదేళ్ల కన్నా తక్కువే పడుతుంది.