కోడికత్తి శీను తల్లిదండ్రులకు అపాయింట్మెంట్ ఇచ్చిన సీఎం జగన్ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. సీఎం జగన్ అపాయింట్మెంట్ లభించడంతో…నాలుగేళ్లుగా జైల్లో ఉన్న శీనుకు బెయిల్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ లాయర్‌తో సహా వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. అయితే సీఎం క్యాంపాఫీస్‌లో ఉన్న స్పందన డెస్క్‌లో అర్జీ ఇచ్చి వెళ్లిపోవాలని అధికారులు వారికి సూచించడంతో హతాశులయ్యారు. సీఎం బిజీగా ఉన్నారని ..అపాయింట్ మెంట్ గురించి తర్వాత సమాచారం ఇస్తామని .. ఆర్జీ తీసుకుని పంపేసారు. తాము దళితులం కాబట్టే జగన్ కలవలేదని తల్లిదండ్రులు మీడియా ముందు విలపించారు.
కోడికత్తి డ్రామాకు నిన్నటికి నాలుగేళ్లు అయింది. గతంలో శీనుకు బెయిల్ వచ్చింది. అయితే ఎన్ఐఏ విచారణలో ఉండటంతో బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఎన్ఐఏ కోర్టును కోరింది. దీంతో బెయిల్ పై విడుదలవకుండానే రద్దయింది. అప్పట్నుంచి జైల్లో ఉన్నారు. ఎలా అయినా ఎన్ఐఏ నుంచి రాష్ట్ర పోలీసు శాఖకు కేసును బదిలీ చేయించాలని.. అందు కోసం ప్రభుత్వం నిరభ్యంతర పత్రం ఇస్తే చాలని లాయర్ చెబుతున్నారు. అలాంటి పత్రం జారీ చేస్తారో లేదో స్పష్టత లేదు. కానీ ఎన్ఐఏ దగ్గరే కేసు ఉంటే మాత్రం విచారణ పూర్తయ్యే వరకూ బెయిల్ రాదని వారు ఆందోళన చెందుతున్నారు.
కోడికత్తి ఎపిసోడ్లో జగన్ కు సానుభూతి వచ్చేందుకే అలా ప్లాన్ చేసుకున్నాని శీను రాసుకున్న లేఖను ఎన్ఐఏ కోర్టుకు సమర్పిచింది చార్జిషీటు కూడా దాఖలు చేసింది. అన్ని రకాల ఆధారాలను పరిశీలించింది. జగన్‌కు లాభం చేసేందుకు సానుభూతి వెల్లువలా వచ్చేందుకు ఆ దాడి చేశారని చార్జిషీట్లో తేల్చారు. కానీ నిజం ట్రయల్ మాత్రం ప్రారంభం కాలేదు. ఎన్నికలకు ముందు ఈ కోడికత్తి దాడి అంశం మరోసారి హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.