విరాట్ కోహ్లీ ఆవేశంలో ఉన్నాడు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదనే సూత్రన్ని విస్మరించేసినట్లుగా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఓడిపోయి సిరీస్ కోల్పోవడమే కాదు.. మూడో టెస్టులో కోహ్లీ వ్యవహరించిన తీరుపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఆనూహ్యంగా తాను టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయాన్ని ముందుగా బీసీసీఐకి తెలిపారో లేదో స్పష్టత లేదు. తన లేఖలో మాత్రం బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపారు.
విరాట్ కోహ్లీకి కొద్ది రోజులుగా పరిస్థితులు అనుకూలంగా లేవు. కొద్ది రోజుల కిందటే వన్డే, టీ ట్వంటీలకు కెప్టెన్గా రోహిత్ శర్మను నియమించారు. టీ ట్వంటీలకు కెప్టెన్గా తానే వైదొలిగాడు. అయితే ఆయనను కొనసాగమని చెప్పామని వినలేదని.. బీసీసీఐ చెప్పింది. దీనిపై వాదోపవాదాలు జరిగాయి. ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్కు ఒకరే కెప్టెన్గా ఉండాలన్న కారణం చూపి రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించారు. అప్పుడే కోహ్లీకి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఇలా చేశారన్న విమర్శలొచ్చాయి. కోహ్లీ కూడా ఫీలయ్యాడు.
అదే అసంతృప్తి మనసులో గూడు కట్టుకుపోయిందేమో కానీ.. ఇప్పుడు టెస్ట్ కెప్టెన్సీ కూడా ఎందుకని భావించినట్లుగా ఉన్నాడు. తనకు తానుగా గుడ్ బై చెప్పేశాడు. కోహ్లీ వ్యవహారం భారత క్రికెట్ లో మరోసారి రచ్చ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐలో ఏకపక్ష నిర్ణయాలు జరుగుతున్నాయని వస్తున్న విమర్శల నేపధ్యంల కోహ్లీ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యే చాన్సులు ఉన్నాయి.
— Virat Kohli (@imVkohli) January 15, 2022