వెస్టిండీస్‌తో ముంబాయి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న టీ20 సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత పరుగుల మెషిన్ విరాట్ కొహ్లి.. తాను తిరుగులేని హీరోనుఅని మరో మారు నిరూపించుకున్నాడు. అదే సమయంలో వెస్టిండీస్ తురుపుముక్క, పరుగుల సునామీగా పేరున్న క్రిస్‌గేల్ రెండో ఓవర్ తొలిబంతికే అవుటైపోవడం విశేషం. ఈ టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఈ రెండో సెమీఫైనల్‌ను యావత్ క్రికెట్ ప్రపంచం… ”క్రిస్‌గేల్ వెర్సస్ విరాట్ కొహ్లి” ల మధ్య మ్యాచ్‌గా అభివర్ణించి… ఆ దృష్టితోనే గమనించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో కొహ్లి మాత్రం తన నిలకడైన హీరోయిజాన్ని నిలబెట్టుకోగా… క్రిస్‌గేల్ కేవలం అయిదుగు పరుగులు మాత్రమే చేసి రెండో ఓవర్లో జస్ప్రీత్ బమ్రా వేసిన తొలి బంతికే పెవిలియన్ ముఖం పట్టాడు. దీంతో భారత శిబిరంలోను, భారత క్రికెట్ అభిమానుల్లోను ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
భారత్ ఇది ఎంతో కీలకమైన మ్యాచ్ కావడంతో.. చావో రేవో తేల్చుకోవడానికే సిద్ధమైంది. అయితే దీనిని పరుగుల వరదకు అనుకూలంగా ఉండే వాంఖడే స్టేడియంలో బ్యాట్స్‌మన్ ల మధ్య పోరుగానే అందరూ అభివర్ణించారు. విరాట్ కొహ్లి నిలకడైన ఆటతీరు మీద అందరికీ నమ్మకం ఉన్నప్పటికీ.. క్రిస్‌గేల్ గనుక చెలరేగి ఆడితే… ఇక ఆ జట్టు విజయాన్ని నిలువరించడం ఎవ్వరి తరమూ కాదని కపిల్‌దేవ్ సహా క్రికెట్ విశ్లేషకులు అందరూ భావించారు.
అయితే ఇక్కడ మరో అంశం కూడా గుర్తించాల్సి ఉంది. రెండు రోజుల కిందట గేల్‌ను తన నివాసానికి ఆహ్వానించి ప్రత్యేకంగా విందు ఇచ్చిన అమితాబ్ బచ్చన్.. భారత్‌తో సెమిఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేయాల్సిందిగా గేల్‌ను కోరడం, అలాగే చేస్తానంటూ ఆయన హామీ ఇవ్వడం కూడా తెలిసిందే. అయితే అమితాబ్ కోరిక నెరవేరలేదు. ఆయనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక, బమ్రా విసిరన బంతికి గేల్ చతికిలపడ్డాడు.
క్రిస్‌గేల్ సాధారణంగా భారత స్పిన్నర్లలో అశ్విన్ బౌలింగ్‌కు ఇబ్బంది పడతాడని, ప్రపంచంలో ఏ బౌలర్‌నైనా లెక్కలేకుండా కొట్టే గేల్.. అశ్విన్‌ను ఆడలేడని అంచనాలు సాగాయి. అశ్విన్ స్పిన్నర్ గనుక.. బౌలింగ్‌కు స్పిన్నర్లు దిగేవరకు, ప్రారంభ ఓవర్లలోనే గేల్ చితక్కొట్టేస్తే ఎలా.. స్పిన్నర్లు రంగంలోకి వచ్చేవరకు నిలువరించడం ఎలా అనే తరహాలోనే అభిమానుల ఊహలు సాగాయి. అయితే.. రెండో ఓవర్ ప్రారంభంలోనే బమ్రా అతణ్ని పెవిలియన్‌కు పంపడంతో.. భారత్‌కు విజయంపై ఆశలు పెరిగాయి.
అంతకుముందు వెస్టిండీస్ టాస్‌గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు దించింది. భారత్జట్టులో అందరూ బాగా ఆడి 192 పరుగులు చేశారు. 193 పరుగుల లక్ష్యంతో వెస్టిండీస్ ఎదురీదుతోంది. నెహ్రా విసిరిన మూడో ఓవర్ చివరి బంతికి వెస్టిండీస్ మరో కీలక ఆటగాడు సామ్యూల్స్ కూడా అవుట్ కావడంతో.. వెస్టిండీస్ ఒక రకంగా కష్టాల్లో పడింది.