గత కొద్ది సంవత్సరాలు గా రియల్ ఎస్టేట్ రంగంలో భారత దేశం లోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ లో అభివృద్ధి గణనీయంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన వేలం పాటలో ఎకరం 100 కోట్ల రికార్డు ధరకు పలికి రియల్ ఎస్టేట్ దిగ్గజాలను సైతం నివ్వెవరపరిచింది. వివరాల్లోకి వెళ్తే..
ఎకరం 100.75 కోట్లు:
హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ ఎండీఏ) తాజాగా కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలో ప్లాట్ల ను వేలం వేసింది. ఈ వేలం ద్వారా రికార్డు స్థాయిలో 3 వేల కోట్ల భారీ ఆదాయాన్ని హెచ్ ఎం డి ఏ సమకూర్చుకుంది. ఇక్కడ వేసిన వేలం లో ఒక ప్లాట్ లో ఎకరం 100.75 కోట్ల రూపాయల ధర పలికింది. రియల్ ఎస్టేట్ సంస్థ రాజ పుష్ప ఇతర సంస్థలతో పోటీపడి రికార్డు ధర కు ఈ స్థలాన్ని కొనుక్కుంది.
ఏంటి ఈ కోకాపేట నియోపోలీస్:
హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీ పురుడు పోసుకునే సమయంలో అప్పటి బేగంపేట విమానాశ్రయానికి దగ్గర కావడంతో బేగంపేటలో కొన్ని సాఫ్ట్వేర్ సంస్థలు ఉండేవి. అయితే 90 వ దశకంలో ఐటీ బూమ్ సమయం లో అప్పటి హైదరాబాద్ శివారు ప్రాంతమైన మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో హైటెక్ సిటీ ఏర్పాటయింది. కాల క్రమేణా అది నగరంలో కలిసి పోవడంతో కొత్త కంపెనీలు నగరాని కి మరింత దూరంగా ఉండే గచ్చిబౌలి ప్రాంతంలో ఏర్పడ్డాయి. ఇక గచ్చిబౌలి లో చిన్న పెద్ద అన్ని కలిపి దాదాపు 400 కి పైగా ఐటి కంపెనీ లు ఉన్నట్లు అంచనా. గచ్చిబౌలి – నానక్ రామ్ గూడా ప్రాంతపు డెడ్ ఎండ్ లో ఈ కోకాపేట మొదలవుతుంది. ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు, కొన్ని విల్లా లు ఉన్న ఈ ప్రాంతం లో పూర్తి స్థాయి కాస్మొ పాలిటన్ నగరం ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నియో పోలీస్ ప్రాజెక్టును చేపట్టింది. రోడ్లు, కరెంటు, వాటర్ పైప్ లైన్, రింగ్ రోడ్డు కనెక్టివిటీ వంటి అన్ని అంశాలను పరిగణ లోకి తీసుకొని నిర్మిస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి లో సమకూరిన తర్వాత హైదరాబాద్ స్వరూపాన్నే పూర్తిగా మార్చే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పాతిక కిలో మీటర్ల దూరం లో ఉండే ఈ ప్రాంతంలో అతి కొద్ది సంవత్సరాల కాలంలోనే ఆకాశాన్ని అంటే హార్మ్యాలు, విదేశాలను తలదన్నే హైటెక్ భవనాలను చూసే అవకాశం కనిపిస్తోంది.
ఇక్కడ ఎకరం 100 కోట్లు, ఇతర నగరాల్లో ఎంత?
హైదరాబాద్ కు సంబంధించినంత వరకు ఎకరం 100 కోట్లు అన్నది రికార్డు స్థాయి ధర, గతంలో హైదరాబాదు లో ఎప్పుడూ వినని ధర. అయితే కొద్ది నెలల క్రిందట చెన్నైలో గోద్రెజ్ సంస్థ అక్కడి పురపాలక సంస్థ నుండి ఎకరం 90 కోట్ల ధర వద్ద కొన్నట్టు సమాచారం. అదేవిధంగా నవీ ముంబై ప్రాంతంలో సిడ్కో పురపాలక సంస్థ కొన్ని నెలల క్రితం నిర్వహించిన వేలం పాటలో, ఎకరం భూమి దాదాపు 250 కోట్ల రూపాయలు పలికింది. ఆ ప్రాంతానికి ఇది అప్పట్లో రికార్డు ధర. ఈ లెక్కన భారత్ లోని పలు మెట్రో నగరాలలో కమర్షియల్ ప్రాంతాలు ( గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాంతాలు మాత్రమే – అంటే కొత్తగా అభివృద్ధి చెందవలసిన ప్రాంతాలు) ఎకరానికి 50 కోట్లనుండి 300 కోట్ల మధ్యలో పలుకుతున్నట్లు అవగతం అవుతుంది. బ్రౌన్ ఫీల్డ్ ప్రాంతాలు ( అంటే ఇదివరకే అభివృద్ధి చెందిన ప్రాంతాలు) ఇంతకంటే ఎక్కువ ధర పలికే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ ఇలా ఎకరాలకు ఎకరాల స్థలం ఒకేచోట దొరికే అవకాశం తక్కువ. పైగా రియల్ ఎస్టేట్ ట్రెండ్ ని సాధారణంగా గ్రీన్ ఫీల్డ్ ప్రాంతాల ధరల తోనే అంచనా వేస్తుంటారు.
ఒకవైపు హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాలకు తలమానికంగా ఎదుగుతోందని ఆనందపడుతున్నా, ఈ ధరలు సామాన్యున్ని హైదరాబాద్ కు దూరం చేస్తాయని అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
– జురాన్ (@CriticZuran)