తెలంగాణ కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల కోసం డూ ఆర్ డై అన్నట్లుగా ప్రయత్నించే లీడర్లు పెరిగిపోతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవి ఇస్తారా..చస్తారా అన్నట్లుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కూడా అదే తరహా స్టేట్ మెంట్ ఇచ్చారు. పార్టీని నమ్మిన వారికి.. కష్టపడి పని చేసిన వారికి పదవులు ఇవ్వకబోతే బాగోదని సంకేతాలు పంపారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్న స్వరం ఆయన వినిపించారు.
ప్రేమ్ సాగర్ రావు చిన్న లీడర్ కాదు. ఆయన స్థాయికి మంత్రి పదవి రావాల్సిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వీర్యం అయినా ఆయన పార్టీని కాపాడుకున్నారు. కానీ ఆయనకు సామాజికవర్గం అడ్డం వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కాకా వెంకటస్వామి కుమారుడు వివేక్ రెడీగా ఉన్నారు. తనకు పదవి ఖాయమని ఆయన చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఆయన కుమారుడికి ఎంపీ టిక్కెట్ ఇప్పించుకున్నారు. అలాంటి వారికి పదవులు ఇస్తే సహించేది లేదని కూడా ప్రేమ్ సాగర్ రావు సంకేతాలు పంపారు.
కోమటిరెడ్డి లేదా.. ప్రేమ్ సాగర్ రావు.. ఇద్దరు మాత్రమే కాదు. ఇంకా జగన్ మంది డూ అర్ డై అన్నట్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఎవరికి చాన్స్ రాకపోయినా వారిలో ఆగ్రహం లావాలా బయటకు వస్తుంది. అది పార్టీకి డ్యామేజ్ చేస్తుంది. అందుకే కేబినెట్ విస్తరణపై మరో లీక్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. పరిస్థితి చూస్తూంటే.. అసలు కేబినెట్ విస్తరణ చేయకపోవడమే మంచిదని హైకమాండ్ అనుకునే అవకాశాలు ఉన్నాయి.