తెలుగుదేశం పార్టీ తరపున చాన్స్ రావడంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొలికపూడి శ్రీనివాస్ ప్రశాంతంగా తన పదవిని నిర్వహించలేకపోతున్నారు. నియోజకవర్గ రాజకీయాలతో కిందా మీదా పడిపోతున్నారు. ఇంకా పది నెలలు పూర్తి కాక ముందు రాజీనామా బెదిరింపులు ప్రారంభించారు. ఇప్పటికే ఆయనకు రెండు, మూడు సార్లు పార్టీ నుంచి హెచ్చరికలు వచ్చాయి. అయినా తగ్గడం లేదు
తాజాగా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున కీలక నేతగా ఉన్న రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ ఆయన టీడీపీ హైకమాండ్ అల్టిమేటం ఇచ్చారు. ఆయనను సస్పెండ్ చేయకపోతే రాజీనామాకైనా సిద్దమని ప్రకటించారు. పార్టీ హైకమాండ్ ను బెదిరించే పనులు.. అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యెలు అసలు చేయరు. కానీ కొలికపూడికి అంత రాజకీయం అర్థం కాకపోవడంతో అదే పని చేస్తున్నారు. పొలిటికల్ సైన్స్ చెప్పేవారికి.. రాజకీయాలు చేసే వారికి చాలా తేడా ఉంటుందని కొలికపూడిని చూస్తే అర్థమైపోతుంది.
తిరువూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట లాంటిది. టీడీపీ గెలిచి చాలా కాలం అయింది. అక్కడ ఉన్న వర్గ పోరాటం ఇతర కారణాల వల్ల పార్టీ ఓడిపోతూ వచ్చింది. అందుకే ఈ సారి అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొలికపూడికి.. పెద్దగా సంబంధం లేకపోయినా టిక్కెట్ ఇచ్చారు. అనూహ్యంగా విజయం సాధించారు. దాన్ని నిలబెట్టుకుని అందర్నీ కలుపుకుని వెళ్లాల్సిన ఆయన.. అందరికీ దూరమవుతున్నారు.