తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో ఇరుక్కున్నారు. తమపై దాడి చేసి కొట్టారని ఓ గ్రామంలో వైసీపీకి చెందిన వార్డు సభ్యురాలు ఆత్మహత్యాపయత్నం చేశారు. నిజంగా కొలికపూడి కొట్టారో లేదో కాని ఎమ్మెల్యే అని తాను చెప్పిందే వినాలని గ్రామ రాజకీయాల్లో తలదూర్చారు. ఫలితంగా ఆయన మళ్లీ పార్టీ హైకమాండ్ దృష్టిలో బ్యాడ్ అయ్యారు.
తిరువూరులో ఓ గ్రామంలో సిమెంట్ రోడ్ వేశారు. ఆ సిమెంట్ రోడ్ స్థలం విషయంలో ఓ కుటుంబం మధ్య గొడవలు ఉన్నాయి. ఆ కుటుంబంలో రెండు వర్గాలు ఉన్నాయి. కొంత మంది టీడీపీ, మరికొంత మంది వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్న వర్గం వారు.. ఆ సిమెంట్ రోడ్ ఎవరూ వాడకుండా ముళ్ల కంచె వేశారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే అ గ్రామానికి వెళ్లి పెద్ద మనిషిలా పంచాయతీ చేయాలనుకున్నారు. కానీ అందులో కుటుంబ వివాదం ఎక్కువగా ఉంది. దాన్ని పట్టించుకోకుండా ..ముళ్లకంచెలు తీసేయాల్సిందేనని .. లేకపోతే కేసులు పెడతామని హెచ్చరించి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే ఇలా చేస్తారా అని వైసీపీకి చెందిన వార్డు సభ్యులు.. అదే కుటుంబానికి చెందిన మహిళ ప్రాణాపాయం లేని పురుగుమందు తాగారు. తాను ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె వచ్చి చెప్పడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చారు. దీంతో కొలికపూడికి మరోసారి సెగ తగిలినట్లయింది.. ఆయన వద్ద నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది.
కొలికపూడికి సివిల్స్ కోచింగ్ ఇచ్చే ఇనిస్టిట్యూట్ ఉంది. ఆయన పొలిటికల్ సైన్స్ ను ఖండఖండాలుగా విభజించి పాఠాలు చెబుతారు. కానీక్షేత్ర స్థాయిలో పాలిటిక్స్ మాత్రం భిన్నంగా ఉంటాయి. వాటిని ఆయన అర్థం చేసుకోలేక.. ఇబ్బందిపడుతున్నారు.