దళిత ఉద్యమనాయకుడు అని ప్రజాప్రతినిధిని చేస్తే అభ్యుదయంగా పోరాడతారని టీడీపీ హైకమాండ్ చాన్సిస్తే రాజకీయం అంటే అసలు చేయాల్సిందే వేరే అని ఆయన అనుకుంటున్నారు. మూడు నెలలకే ఆయనను పార్టీ పక్కన పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎలాగోలా సైలెంటుగా ఉంటానని పార్టీ లైన్ దాటననిచెప్పి సర్దుబాటు చేసుకున్నారు. కానీ అది కొంత కాలమే. మళ్లీ ఇప్పుడు చెలరేగిపోతున్నారు. ఆయనే కొలికపూడి శ్రీనివాసరావు.
తాజాగా ఆయన తిరువూరు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై పడ్డారు. వారు బెల్టుషాపులు పెట్టారంటూ ఆయన వీడియోలు తీసి హల్ చల్ చేశారు. అంతేకాదు తానే దుకాణాలు మూయించారు. ఏమైనా ఉంటే ఎక్సయిజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ ఇలా సొంతంగా దుకాణాలు మూయించడం.. ఇళ్లు కూలగొట్టించడం వంటివి చేస్తూ.. వివాదాస్పదం అవుతున్నారు. ఆయన చేస్తున్న పనులు వైసీపీ లాంటిపార్టీలకు ఉపయోగపడతాయి కానీ.. సొంత పార్టీకి ఏంటిలాభం ?
కమిషన్ల కోసమే ఆయన ఈ పని చేస్తున్నారని ఆయనను.. నాలుగేళ్ల పాటు మోసి రాజకీయ నాయకుడ్ని చేయడంలో కీలక పాత్ర పోషించిన ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి కూడా అదే పనిగా ప్రసారం చేస్తోంది. ఆయన తీరు ఏ మాత్రం సరిగా లేదని చెబుతోంది. మోనార్క్ లా వ్యవహరిస్తున్నారని అంటోంది. అయినా కొలికపూడి మారడంలేదు. కనీసం తనను అదే పనిగా డిబేట్లలో కూర్చోబెట్టి పాపులర్ చేసిన ఆర్కే సలహాలు అయినా తీసుకుని రాజకీయం చేస్తే కాస్త ఎక్కువ కాలం రాజకీయ జీవితం ఉంటుందని సలహాలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన దారి ఆయనదే.