ఏబీఎన్ టీవీ చానల్ చర్చలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టిన కొలికపూడి శ్రీనివాసరావు .. టీడీపీ ప్రోద్భలంతో ఆ పని చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను పూర్తిగా టీడీపీకి లింక్ పెట్టి ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. బీజేపీకి వైసీపీ సోషల్ మీడియా సపోర్ట్ గా ఉంది. బీజేపీ కన్నా ఎక్కువగా వైసీపీ నేతలు.. ఇది టీడీపీ చేయించిన పని అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. జగన్ పాదయాత్ర జరిగినప్పుడు.. సాక్షి టీవీలో వచ్చిన తన స్పందనలు.. సాక్షి మీడియాలో వచ్చిన తన ప్రకటనల గురించి బయట పెట్టారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులను రీపోస్ట్ చేశారు. అవన్నీ జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు పలికేలా ఉన్నాయి.
జగన్మోహన్ రెడ్డి కోసం జనం కదులుతున్నారని అప్పట్లో కొలికపూడి శ్రీనివాసరావు స్టేట్మెంట్లు ఇచ్చారు. తనను పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్న వైసీపీ సోషల్ మీడియా నేతల్ని … తాను జగన్‌కు మద్దతుగా మాట్లాడిన సమయంలో తనకు ఎంత పే చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కొలికపూడి శ్రీనివాసరావు విద్యాధికుడు. ఆయన కోచింగ్ సెంటర్ పెట్టుకుని సివిల్ సర్వీస్ యాస్పిరెంట్లకు శిక్షణ ఇస్తూంటారు. ఈ విధంగా గుర్తింపు ఉండటంతో జగన్ పాదయాత్ర సమయంలో ఆయన అభిప్రాయాలు పాజిటివ్‌గా ఉండటంతో జగన్ మీడియా ఉపయోగించుకుంది. ఆ తర్వాత అమరావతి విషయంలో జగన్ నిర్ణయాలను కొలికపూడి శ్రీనివాసరావు వ్యతిరేకించారు.
అమరావతి జేఏసీ కన్వినర్‌గా మారి ఉద్యమం చేస్తున్నారు. దాంతో ఆయన ఇప్పుడు టీడీపీ నేత అయిపోయారు. టీడీపీకి మద్దతుగా ఉన్నారంటూ… తమ పాత మద్దతుదారుడిపై వైసీపీ నేతలు నిందలేస్తున్నారు. ఇలా వైసీపీ కోసం పని చేసిన వారందర్నీ ఆ పార్టీ నేతలు దూరం చేసుకుంటున్నారని.. అది చివరికి పతనానికి దారి తీస్తుందని ఇతర పార్టీల నేతలు అంటున్నారు. కొలికపూడి శ్రీనివాసరావు కూడా అలాంటి అభిప్రాయాన్నే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి అమరావతి ఉద్యమంతో రానంత ఫోకస్.. శ్రీనివాసరావుకు చెప్పుతో దాడి అంశంతో వచ్చింది.