నిర్బయ ఘటన జరిగినప్పుడు దేశం మొత్తం రగిలిపోయింది. ప్రజల ఆవేశాన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా మల్చుకున్నాయి. ఓట్లు సొందాయి. నిర్భయ చట్టాల్ని తెస్తామని చెప్పాయి. తెచ్చాయి కూడా. కానీ నిర్భయ లాంటి ఘటనలు ఆగాయా అంటే..ఇంకా పెరిగాయని చెప్పుకోవాలి. తాజాగా కోల్ కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఉదంతం దానికి మరో సాక్ష్యం. నిర్బయ చట్టం వచ్చిన తర్వాత అలాంటి ఘోరాలు ఎన్నో జరిగాయి. జరుగుతూననే ఉన్నాయడానికి ఇవే నిదర్శనాలు.
ఇప్పుడు నిర్భయ స్థాయిలో కోల్ కతా డాక్టర్ హత్యాచార ఉదంతాన్ని రాజకీయం చేస్తున్నారు. దేశం మొత్తం ఓ అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారు. బహుశా రేపు మరో చట్టం తీసుకొస్తామని ప్రకటించి ప్రజల భావోద్వేగాలతో ఆడుకుని రాజకీయ పార్టీలు లాభపడవచ్చు..కానీ అది పరిష్కారం కాదని ఇప్పటికే అనేక ఘటనలు నిరూపిస్తున్నాయి. పొలిటికల్ స్కోర్లు సెటిల్ చేసుకోవచ్చు కానీ.. మరొకరు అలాంటి ఘోరానికి బలి కాకుండా చేయడం ఎలా అన్నదే ఇప్పుడు అందరి తక్షణ కర్తవ్యం.
మన దేశంలో చట్టాలకు కొదవ లేదు. నేరం చేసేవాడికి శిక్ష పడుతుందన్న భయం ఉన్నప్పుడే ఆ చట్టాలంటే కాస్త విలువ ఉంటుంది. కానీ అలాంటిదేమీ లేనప్పుడు.. మనుషుల్ని.. స్థాయిల్ని బట్టి చట్ట ప్రవర్తన మారిపోతున్నప్పుడు ఎవరూ సమాజంలో మార్పు రాదు. ఇప్పుడు అదే జరుగుతోంది. చట్టాలు నేరాల్ని చేసే వారిని భయపెట్టడం లేదు. దీనికి పరిష్కారం కనుగొంటేనే.. నిర్భయ లాంటి ఘటనలు ఆగిపోతాయి. కోల్ కతా డాక్టర్ లాంటి వాళ్లు బలి కాకుండా ఉంటారు. ఇప్పుడు చేయాల్సింది చట్టాలు కాదు.. అమలు చేసే పకడ్బందీ వ్యవస్థను సిద్ధం చేసుకోవడం. అప్పుడే ఇలాంటివి తగ్గుతాయి.