`ఆర్.ఆర్.ఆర్`లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ విశ్వరూపం చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. `లేటయినా.. లేటెస్టుగా వస్తా` అంటూ… ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఊరిస్తూనే ఉన్నారు రాజమౌళి. ఆ నిరీక్షణలకు తెరతీస్తూ… `కొమరం భీమ్` టీజర్‌ని విడుదల చేసేశారు.
వేటకి సిద్దమైన ఓ బెబ్బులిని, యుద్ధానికి కత్తి దూసిన ఓ వీరుడ్ని చూపించినట్టుగా.. కొమరం భీమ్ పాత్రని డిజైన్ చేశారు రాజమౌళి. అభిమానుల అంచనాలకు, ప్రేక్షకుల ఊహలకూ ఏమాత్రం తగ్గకుండా.. భీమ్ పాత్రని తీర్చిదిద్దారు. `అల్లూరి సీతారామరాజు` పాత్రని ఎన్టీఆర్ గొంతుతో పరిచయం చేసిన రాజమౌళి.. ఇప్పుడూ అదే ఫార్ములాకు కట్టుబడుతూ, ఎన్టీఆర్ పాత్రని రామ్ చరణ్ పాత్రతో పరిచయం చేశారు.
వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్
నిలబడితే.. సామ్రాజ్యాలు సాగిల పడతాయి
వాడి పొగరు.. ఎగరే జెండా
వాడి ధైర్యం చీకట్లిని చీల్చే మండుటెండ
వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ
నా తమ్ముడు… గోండు బెబ్బులి కొమరం భీమ్
అంటూ గొప్ప ఎలివేషన్ ఇచ్చారు. విజువల్ పరంగా.. ఏమాత్రం తక్కువ చేయలేదు. వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్ అన్నచోట.. కెరటం కొమరం భీమ్ ముందు ఒంగినట్టు చూపించడం – నిజంగా.. రాజమౌళి విజన్‌కు అద్దం పట్టే షాటే. అలాంటి షాట్లు చాలా కనిపిస్తాయి. ఎన్టీఆర్ మేకొవర్, రాజమౌళి విజువల్స్, రామ్ చరణ్ ఇచ్చిన వాయిస్ ఓవర్, కీరవాణి.. అదిరిపోయే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ ఈ టీజర్‌కు ప్రాణం పోశాయి. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మరోసారి ఫిదా చేసేశాడు రాజమౌళి. వాళ్లకు దసరా కాస్త ముందే వచ్చేసినట్టైంది.