తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పుట్టినరోజు శుబాకాంక్షలు తెలిపారు. స్వ దస్తూరితో సంతకం చేసి మరీ లేఖ పంపారు. మామూలుగా అయితే ఇందులో విశేషం లేదు. కానీ ఆ లేఖలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎమ్మెల్యేగా పేర్కొన్నారు. దీంతో ఈ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కారణం గత అసెంబ్లీ సమావేశాల తొలి రోజే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనర్హతా వేటు వేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కోమటిరెడ్డి హెడ్ ఫోన్ విసిరేశారు. అది వెళ్లి శాసనమండలి చైర్మన్ కంటికి తగిలిందని… ఇలాంటి క్రమశిక్షణా చర్యలను సహించబోమంటూ.. అప్పటికప్పుడు అనర్హతా వేటు వేశారు. కోమటిరెడ్డితో పాటు.. సంపత్ కుమార్ ను కూడా ఈ జాబితాలో చేర్చారు. రాత్రికి రాత్రే గెజిట్ నోటిపికేషన్ రిలీజ్ చేశారు. ఈసీకి పంపారు. ఈసీ కూడా నల్లగొండ, ఆలంపూర్ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటించింది. అందులో రాజ్యసభ ఎన్నికల్లోనూ వీరికి ఓటేసే అవకాశం ఇవ్వలేదు.
తమపై అనర్హతా వేటు వేయడాన్ని నిరసిస్తూ… వీరు హైకోర్టుకెళ్లారు. విచారణ జరిపిన హైకోర్టు.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా అనర్హతా వేటు వేశారని … స్పీకర్ నిర్ణయం చెల్లదని తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఈ తీర్పుపై ప్రభుత్వం కానీ.. అసెంబ్లీ కానీ… రివ్యూ పిటిషన్ వేయలేదు. కానీ వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ తరపున కొంత మంది ఎమ్మెల్యేలు మాత్రం పిటిషన్ వేశారు. ప్రస్తుతం వీరికి పిటిషన్ వేసే అర్హత ఉందా లేదా అన్నదానిపై హైకోర్టులో చర్చలు జరుగుతున్నాయి. హైకోర్టు తీర్పును అమలు చేస్తే .. శాసనవ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యాన్ని తామే పాటించినట్లవుతుంది. అందుకే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి.. హైకోర్టు తీర్పును తిరస్కరిస్తున్నట్లు తీర్మానం చేయాలనుకున్నారు. కానీ ఇది మరిన్ని చిక్కులు తెచ్చి పెడుతుంది. దీంతో కోమటిరెడ్డి, సంపత్‌ల అనర్హతపై తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది ఉత్కంఠ కలగిస్తూనే ఉంది.
ఇలాంటి సమయంలో… కేసీఆర్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎమ్మెల్యేగా సంబోధిస్తూ… పుట్టిన రోజు శుభాకాంక్షల లేఖ పంపడంతో.. కొంత క్లారిటీ వచ్చినట్లు ఉందని తెలంగాణ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేల అనర్హతపై కేసీఆర్ వెనక్కి తగ్గుతారని..ఈ లేఖతో అంచనా వేయవచ్చంటున్నారు. స్వయంగా కేసీఆర్ సంతకం చేసిన పంపిన లేఖ కావడంతో.. వ్యతిరేకంగా స్పందించడానికి ఆర్ఎస్ వర్గాలు కూడా… నిరాకరిస్తున్నాయి..