మునుగోడులో బీజేపీ మూడో స్థానంలో ఉందని సర్వేలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికల పేరుతో సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో తెలియదు కానీ ఆయన పోటీ జరుగుతోంది..బీజేపీ. టీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య కాదని.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో కోమటిరెడ్డి పోటీ పడుతున్నారన్నట్లుగా కవర్ చేస్తున్నారు. తాను ఇండిపెండెంట్‌గా అయినా గెలవగనని సవాల్ చేస్తున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ నేతల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నాయి.
మునుగోడులో బీజేపీకి బలం లేదు. ఆ విషయం గత కొన్నాళ్లుగా అక్కడ జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీకి వస్తున్న ఓట్ల శాతాలే చెబుతున్నాయి. ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి చేరారు కాబట్టి ఆయన అనుచరవర్గం అంతా బీజేపీలో చేరుతుంది. ఆ విధంగా బీజేపీ బలోపేతం అవుతుంది. ఇది వాస్తవమే అయినా అసలు బీజేపీ పోటీ లో లేదన్నట్లుగా అంతా వ్యక్తిగత పోరాటమన్నట్లుగా రాజగోపాల్ ెడ్డి మాట్లాడటమే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
దుబ్బాక ఉపఎన్నిక జరిగినప్పుడు వరుసగా ఓడిపోతున్నాడని రఘునందన్ రావుపై సానుభూతి ఓట్లు వేశారని చెప్పుకున్నారు. కానీ బీజేపీకి వేశారని ఎవరూ చెప్పుకోలేదు. హుజూరాబాద్‌లో కూడా ఈటల కు ఓట్లేశారు కానీ బీజేపీకి కాదనుకున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా .. మునుగోడులో తనకు వచ్చే ఓట్లన్నీ వ్యక్తిగతంగా సంపాదించుకుంటున్నవే కానీ.. బీజేపీ వల్ల కాదని చెప్పడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. బీజేపీని తక్కువ చేయడం మాత్రం సీనియర్ నేతలను విస్మయానికి గురి చేస్తోంది.