టీపీసీసీ చీఫ్ రేసులో ముందున్నానని ప్రకటనలు చేసుకుంటూ.. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. ఆయన సోదరుడు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెద్ద చిక్కులు తెచ్చి పెట్టారు. తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అని.. తాను త్వరలో బీజేపీలో చేరుతానని ప్రకటించేశారు. అయితే.. కోమటిరెడ్డి మాత్రం… కాంగ్రెస్‌లోనే ఉంటారని కూడా చెప్పుకొచ్చారు. పీసీసీ చీఫ్ రేసులో సోదరుడు ఉన్నాడని చెబుతూనే.. ఆ పార్టీకి తెలంగాణలో భవిష్యత్ లేదని తేల్చేశాడు. అసలే.. ప్లస్ మైనస్సుల మధ్య పీసీసీ చీఫ్ రేసు హోరాహోరీగా సాగుతున్న సమయంలో… రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కోమటిరెడ్డికి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వేర్వేరు కాదు. వెంకటరెడ్డి నీడలోనే రాజగోపాల్ రెడ్డి ఎదిగారు. ఆయన చెప్పినట్లే రాజకీయం చేస్తారు. ఇద్దరూ రాజకీయంగా ఎలా బలపడాలన్నదానిపై.. పరస్పర వ్యూహాలు అమలు చేస్తూంటారని వారి గురించి తెలిసిన వారందరికీ విదితమే. ఇప్పుడు కూడా.. కోమటిరెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వకపోతే బీజేపీకి వెళ్లిపోతారన్న సంకేతాన్ని పంపడానికే.. అలా మాట్లాడారన్న చర్చలు కూడా కాంగ్రెస్‌లో ప్రారంభమయ్యాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా రోజుల క్రితమే.. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ హైకమాండ్‌తో చర్చలు జరిపారు.
కానీ రాజగోపాల్ రెడ్డి.. తాను బీజేపీలో చేరితే.. మొత్తం బీజేపీపై పెత్తనాన్ని తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పట్లో ఆయన డిమాండ్లు చూసి బీజేపీ నేతలకు చిర్రెత్తుకొచ్చింది. ఆయనతో మాటలు తగ్గించేశారు. దీంతో కోమటిరెడ్డి కూడా వెనక్కి తగ్గారు. అయితే.. ఇప్పుడు బీజేపీ ఫుల్ స్వింగ్‌లో ఉంది. దీంతో.. అప్పటి డిమాండ్ల ప్రకారం లేకపోయినా… రాజకీయ భవిష్యత్ అయినా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. సోదరుల్లో ఎవరో ఒకరు అధికార పార్టీలో ఉంటారని.. వ్యూహం సిద్ధం చేసుకుని ఉండవచ్చని అంటున్నారు.