ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామంటూ నిన్నటి వరకూ గంభీరమైన ప్రకటనలు చేసిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రేవంత్‌కు పదవి ప్రకటించగానే రెబల్‌గా మారిపోయారు. ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న వెంటనే… తీవ్రమైన పదజాలంతో సొంత పార్టీపై విరుచుకుపడ్డారు. సోనియా, రాహుల్‌పై విమర్శలు చేయనంటూనే.. పీసీసీ పదవిని ఓటుకు నోటులా అమ్ముకున్నారని విరుచుకుపడ్డారు. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ … రేవంత్ రెడ్డి నుంచి డబ్బులు తీసుకున్నారని.. తాను త్వరలో ఆధారాలు బయట పెడతానని.. కోమటిరెడ్డి ప్రకటించారు.
తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంతో కొంత మంది సీనియర్లు అసంతృప్తికు గురయ్యారని.. వారందర్నీ తాను స్వయంగా కలిసి.. కలిసి పని చేసేలా ఒప్పించాలని రేవంత్ ప్లాన్లు వేసుకుంటున్నారు. ముందుగా ఆయన కోమటిరెడ్డినే కలవాలనుకున్నారు. ఇది తెలిసిన రేవంత్.. తనను టీడీపీ నుంచి వచ్చిన వారు ఎవరూ కలవొద్దని ప్రకటించారు. తాను ఎవర్నీ కలవబోనన్నారు. తన రాజకీయ భవిష్యత్‌ను కార్యకర్తలు నిర్ణయిస్తారని.. పాదయాత్రకు ప్రణాళికలు వేసుకున్నారు. భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి .. తన నియోజకవర్గ పరిధిలో.. ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకూ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
సోమవారమే పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు తెచ్చి పెట్టాలని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ఇక గాంధీ భవన్ మెట్లెక్కనని కూడా ప్రకటించారు. గడ్కరీని కోమటిరెడ్డి అదేపనిగా పొగిడారు. దీంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినందుకు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ పై కొంత మంది సీనియర్లు అసంతృప్తిలో ఉన్నారు. వారందరూ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.