కాంగ్రెస్ పార్టీ నియమించిన కమిటీలపై అసంతృప్తులు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. అయితే, వాటిని బయటకి రాకుండా సర్దిచెప్పాలంటూ హైకమాండ్ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్నట్టు లేవు. ఇప్పటికే, సీనియర్ నేత వీహెచ్ బహిరంగంగానే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇక, కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి ఏకంగా పార్టీ తీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం! వార్డు మెంబర్ గా గెలవలేనివారిని కూడా కమిటీలో తీసుకొచ్చి పెట్టారంటూ వ్యాఖ్యానించారు రాజగోపాల్. ఇదే విషయమై కుంతియాకు ఫోన్ చేశాననీ… ‘ఎక్కడ్నుంచి వచ్చినవురా నయినా, మాకు శనిలాగ తగిల్నవ్ అని నేరుగా అడిగిన. ప్రజలు ఎవర్ని కోరుకుంటున్రో నీకు దెల్సా? ఎవరు తెలంగాణ కోసం పోరాటం చేసిన్రు? ఆళ్లను ముందుకు పెడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తదిగానీ… ఈ బ్రోకర్ నా**** ఎక్కడ్నుంచి తీసుకొచ్చి పెట్టినవ్ రా అని ఫోన్ మాట్లాడినా పొద్దున’ అంటూ ఓ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కుంతియాకు తాను భయపడేది లేదనీ, వందమంది కుంతియాలు వచ్చినా తననేం చెయ్యలేరన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాల వల్లనే అధికారం కోల్పోయిందనీ, అంతేగానీ దీన్లో కేసీఆర్ గొప్పతనం కాదని వ్యాఖ్యానించారు. గాంధీభవన్ లో కూర్చుని టీవీలూ పేపర్ల ముందు మాట్లాడేటోళ్లకు టిక్కెట్లు ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ కి అవసరమా కదా అని ఢిల్లీకి ఫోన్ చేసి అడిగానన్నారు. అన్ని కమిటీలూ శుద్ధ వేస్టనీ, కుంతియాకు బుద్ధిలేదనీ, తెలివి లేదనీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడించినట్టు ఆడటం తప్ప ఆయకేమీ తెలీదంటూ ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు. నిన్నమొన్న పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా చేశారంటూ రాజగోపాల్ ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకుల్ని గుర్తించడంలో హైకమాండ్ ఘోరంగా విఫలమైందన్నారు.
మొత్తానికి, వద్దని రాహుల్ గాందీ వారించినా కూడా… అసంతృప్తులన్నీ మీడియా ముందుకే వచ్చేస్తున్నాయి! కమిటీల నియామక అంశమై కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరైన వెంకట రెడ్డి కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా.. తరువాత వెనక్కి తగ్గారు. ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కానీ, రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఏకంగా కుంతియాను ఇష్టం వచ్చినట్టు విమర్శించారు. మరి, దీన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు స్వయంకృతమే ప్రధానమైన అడ్డంకి అని మరోసారి నిరూపితం అయ్యేట్టుగానే కనిపిస్తోంది.