బీజేపీ తరపున మునుగోడులో పోటీ చేస్తున్న బడా కాంట్రాక్టర్ కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కంటి మీద కునుకు ఉండటం లేదు. ఆయన ఆర్థిక వనరులన్నీ దిగ్బంధం అయ్యాయి. ఎలా తెలుసుకుంటున్నారన్న విషయాన్ని పక్కన పెడితే… ఎక్కడ నుంచి ఎలా తరలిస్తున్నా పోలీసులు వెంట పడి పట్టుకుంటున్నారు. అటు విజయవాడ నుంచి తీసుకొస్తున్నా.. ఇటు హైదరాబాద్ నుంచి తరలిస్తున్నా సరే… రూ. కోట్లకు కోట్లను పోలీసులు వెంటాడి పట్టేసుకుంటున్నారు.
ఇలా ఇప్పటి వరకూ హైదరాబాద్‌తో పాటు మునుగోడు శివార్లలో దొరికినట్లుగా చెబుతున్న డబ్బు రూ. పదిహేను కోట్ల వరకూ ఉంటుంది. ఇదంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదే. తాజాగా హైదరాబాద్ శివార్లలో బైక్‌ల మీద కూడా కొంత మందితో తరలించాలనుకున్న సొమ్మును పోలీసులు పట్టుకున్నారు. కోమటిరెడ్డి దగ్గర బంధువులు తెమ్మన్నారని తీసుకెళ్తున్నామని వారు పోలీసులకు చెప్పారు. ఎదో విధంగా ఎవరి కంట పడకుండా కొంత సొమ్మును తెప్పించుకుని ఎలక్షనీరింగ్ చేస్తున్నారు.. కానీ అది సరిపోవడం లేదు.
కదిలిస్తే పోలీసులు పట్టుకుంటున్నారు. దీంతో బీజేపీ నేతలకు కంటి మీద కనుకు ఉండటం లేదు. అసలు ఖర్చు కన్నా.. పోలీసులు పట్టుకుంటున్నదే ఎక్కువ ఉంటూండటంతో వారికి తిప్పలు తప్పడం లేదు. ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నా.. అసలు బలగం అంతా రాష్ట్రానిదే. అధికారులంతా రాష్ట్రం వారే. ముఖ్యంగా పోలీసు బలగాలు రాష్ట్రానివే. అందుకే బీజేపీ నేతలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.