శత్రువులు ఎక్కడో ఉండరు చెల్లెళ్లు, కూతుళ్ల రూపంలో ఇంట్లోనే ఉంటారంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కానీ రాజకీయంగా దాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు .. మరో రకంగా మార్చుకుని వాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడో ఉండరు.. సొంత పార్టీ నేతల రూపంలోనే ఉంటారు. తాజాగా మరోసారి తెలంగాణ కాంగ్రెస్ కు అదే అనుభవం అయింది. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం ఓట్లు మాత్రమే వస్తాయని.. ఆ పార్టీకే చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. తాను సర్వే చేయించానని.. అక్కడ ఈటల రాజేందర్‌కు అరవై శాతం ఓట్లు వస్తాయని.. టీఆర్ఎస్కు ముఫ్పైశాతం వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.
పీసీసీ చీఫ్ పీఠం ఇవ్వనందుకు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిచేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హుజూరాబాద్‌లో కనీసం డిపాజిట్ తెచ్చుకోవాలని ఆయన రేవంత్‌కు సవాల్ చేశారు. దానికి తగ్గట్లుగా అక్కడ డిపాజిట్ రాదని చెప్పడానికి ఆయన సర్వేల అంశాన్ని తెరపైకి తెచ్చారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత ఘోరంగా ఉన్నా.. ముందుగా.., ఆ పార్టీ నేతలుచెప్పుకోరు. అలా చెప్పుకుంటే.. డ్యామేజ్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ ఇమేజే. ఇప్పుడే వెనుకబడిపోయారన్న అభిప్రాయం… ప్రజల్లో ఏర్పడుతుంది . దీని కోసమే కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా రేవంత్ రెడ్డి వర్గీయులు అనుమానిస్తున్నారు.
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న పరిస్థితి ఉందని అందరికీ తెలుసు. ఈటల బీజేపీలో చేరడంతో బీజేపీ రేసులోకి వచ్చింది. అయితే.. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత అక్కడ ముక్కోణపు పోటీ జరుగుతుందన్న అభిప్రాయం మెల్లగా వినిపించడం ప్రారంభించింది. దళిత వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉండటం.. రెడ్డి సామాజికవర్గం మొత్తం కాంగ్రెస్‌కు పని చేసే చాన్స్ ఉండటంతో.. ఈ అంచనాలు వేశారు. అయితే కోమటిరెడ్డి ఇప్పుడు.. ఈ ప్లస్ పాయింట్ కాంగ్రెస్ పార్టీకి అందకుండా చేసేస్తున్నారు.