పనికి మాలిన నాయకులంతా నల్గొండ జిల్లాలోనే ఉన్నారనీ, అందర్నీ ప్రజలు ఓడ గొట్టాలని మొన్నటి సభలో కేసీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. నల్గొండలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ 10 నియోజక వర్గాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, జిల్లాలో పది స్థానాలు హస్తగతం కాకపోతే, అప్పటికి తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నా సరే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతా అంటూ సవాల్ చేశారు. తన సవాల్ ను కేసీఆర్ స్వీకరిస్తున్నారా లేదా చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
కేసీఆర్ తన సొంత నియోజక వర్గంలో ఒకలా, కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లో మరోలా ప్రజలను చూస్తున్నారని ఆరోపించారు. గజ్వేల్, సిద్ధిపేట నియోజక వర్గాల్లో థర్మల్ పవర్ ప్లాంట్లు ఎందుకు పెట్టలేదనీ, ఇక్కడే ఎందుకు పెడుతున్నారనీ, దీని వల్ల మిర్యాలగూడ పరిసర ప్రాంతాలన్నీ కాలుష్యమయం అవుతాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దామచర్ల ప్లాంటును మూసేస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. బతుకమ్మ చీరల పేరుతో తెరాస నాయకులు కోట్లకు కోట్లు దోచుకున్నారంటూ ఆరోపించారు.
నిజానికి, తెరాసకు ఈసారి నల్గొండ జిల్లా సవాలుగానే కనిపిస్తోంది. ఇతర జిల్లాల్లో తమ చతురతతో గులాబీ జెండా ఎగరేసినా… ఈ జిల్లాకి వచ్చేసరికి కేసీఆర్ కొంత తటపటాయిస్తున్నారు. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా తామే గెలుస్తామని గతంలో గొప్పగా చెప్పుకుంటే వచ్చిన కేసీఆర్… నల్గొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు వెళ్లే ప్రయత్నం చేసి, వెనక్కి తగ్గిపోయిన సంగతి తెలిసిందే. గుత్తా సుఖేందర్ రెడ్డి తెరాసలో చేరినా, కాంగ్రెస్ కు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డా కూడా ఆయన్ని ఆపేశారు కదా. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలవడం ద్వారా ఈ జిల్లాలో చాలా నియోజక వర్గాల్లో తెరాసకు మరింత గట్టిపోటీ ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ద్రోహులుగా విమర్శలు చేసి, ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. నిజానికి, నల్గొండ కాంగ్రెస్ కి మంచి పట్టున్న జిల్లా. కీలక నేతలు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి, కోమటిరెడ్డి సవాల్ చేసినట్టుగా పది స్థానాలు దక్కించుకునేందుకు ఆయన సొంతంగా చేయబోయే కృషి ఎలా ఉంటుందో చూడాలి. కోమటిరెడ్డి సవాలుకు తెరాస నుంచి ఎవరు స్పందిస్తారో చూద్దాం.