కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా 2023 ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయని జోస్యం చెప్పారు. వివరాల్లోకి వెళ్తే
కోమటిరెడ్డి ప్రెస్ తో మాట్లాడుతూ, తనకున్న 35 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్ల స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ లలో ఏవైనా రెండు పార్టీలు కలవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పుకొచ్చారు. మతతత్వ పార్టీ బిజెపితో కాంగ్రెస్ ఎన్నటికీ కలవలేదని, కాబట్టి తాము కెసిఆర్ తో కలిసి తీరవలసిన పరిస్థితులు ఏర్పడతాయని, అదేవిధంగా కేసీఆర్ కూడా బిజెపితో కలవలేరని, ఈ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో రాబోయేది కచ్చితంగా హంగ్ అసెంబ్లీ యే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అదే సమయంలో సొంత పార్టీపై కూడా వ్యాఖ్యలు చేశారు వెంకటరెడ్డి. ఏ ఒక్కరో కాంగ్రెస్ పార్టీని గెలిపించలేరని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఐకమత్యం కొరవడిందని కూడా వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగవుతున్నాయని, రాబోయే ఎన్నికలలో సొంతంగా మెజార్టీ సాధించలేకపోయినా గణనీయమైన సీట్లు సాధిస్తామని జోస్యం చెప్పారు వెంకటరెడ్డి.
రాజకీయ వర్గాలలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చకు దారితీసాయి. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు బిజెపికి లాభం చేకూరుస్తాయని, ఈ రెండు పార్టీలు ఒకటే కాబట్టి రెండు పార్టీలలో ఏ పార్టీ నచ్చకపోయినా బిజెపికి ఓటు వేయండి అని బిజెపి ప్రచారాన్ని మొదలు పెట్టడానికి ఊతమిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.