కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే బీజేపీ అగ్రనేతల్ని కలుస్తున్నారు. గడ్కరీ, అమిత్ షా, మోదీలను మార్చి మార్చి కలుస్తున్నారు. ఏమిటంటే తన నియోజకవర్గం పనుల కోసమని చెబుతున్నారు. ఏ బీజేపీ ఎంపీ కూడా ఇన్ని సార్లు కలవరు. వారు అపాయింట్ మెంట్లు కూడా ఇవ్వరు. కానీ కోమటిరెడ్డి విషయంలో మాత్రం కలవడానికి చాన్స్ ఇస్తున్నారు. బీజేపీలో చేరేందుకు కోమటిరెడ్డి రెడీగా ఉన్నారు. బీజేపీ నేతలు కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ తన కోరికలేమిటో అడుగుతారేమోనని కోమటిరెడ్డి పదే పదే కలుస్తున్నారని అంటున్నారు.
ఏ హామీలు తీసుకోకుండా బీజేపీలో చేరితే తన పరిస్థితి దారుణంగా ఉంటుందని కోమటిరెడ్డికి తెలియనిదేం కాదు. అందుకే ఆయన గట్టి హామీ కోరుకుంటున్నారని చెబుతున్నారు. ఆయన ఏం కోరుకుంటున్నారన్నది పార్టీ అగ్రనేతలకే చెబుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై పై నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పదే పదే కలుస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన కార్యక్రమాలను ఆయన చేయడం లేదు. పాదయాత్రలు చేయాలని చెప్పినా ఇదిగో అదిగో అంటున్నారు కానీ చేయడం లేదు. రేవంత్ కు వ్యతిరేకంగా ఎవరైనా జట్టు కడితే ముందుగా వారి దగ్గరకు వెళ్తున్నారు.
ఇప్పటికే కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నారు. పట్టుబట్టి బీజేపీలో చేరి రిస్క్ తీసుకుని ఆయన మాజీ ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలో చేరిన ఉపఎన్నిక రాదు. అందుకే తొందరపడుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం… ఇతర నేతల్ని కాదని నెత్తిన పెట్టుకుంటామన్న హామీ మాత్రం ఇవ్వలేకపోతోంది. అందుకే కోమటిరెడ్డి జంపింగ్ ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది.